డిసెంబర్‌ నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఎవరంటే..? | Sakshi
Sakshi News home page

ICC Player Of The Month: డిసెంబర్‌ నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ ఎవరంటే..?

Published Tue, Jan 10 2023 10:05 PM

Harry Brook And Gardner Crowned ICC Player Of December Month - Sakshi

డిసెంబర్‌ నెల 2022 పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును ఐసీసీ ఇవాళ (జనవరి 10) ప్రకటిం‍చింది. భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ ఈ అవార్డును గెలుచుకున్నాడు. 23 ఏళ్ల ఈ ఇంగ్లీష్‌ యువ బ్యాటర్‌ ఇటీవల ముగిసిన పాకిస్థాన్‌ టూర్‌లో విశేషంగా రాణించి 3 టెస్ట్‌లో ఏకంగా 468 పరుగులు స్కోర్‌ చేశాడు. ఫలితంగానే అతన్ని ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు వరించింది.

ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం బ్రూక్‌.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ ట్రవిస్‌ హెడ్‌ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొన్నప్పటికీ, ఐసీసీ అతడివైపే మొగ్గుచూపింది. డిసెంబర్‌లో బ్రూక్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ చేసి, పాక్‌ను వారి సొంతగడ్డపై 17 ఏళ్ల తర్వాత మట్టికరిపించడంలో కీలకంగా వ్యవహరించాడు. పాక్‌తో టెస్ట్‌ సిరీస్‌లో బ్రూక్‌ సహా మిగతా ఇంగ్లీష్‌ ప్లేయర్లంతా మూకుమ్మడిగా రాణించడంతో ఇంగ్లండ్‌ 3-0 తేడాతో పాక్‌ను ఊడ్చేసింది.

ఇక మహిళల ప్లేయర్‌ ఆప్‌ ద మంత్‌ అవార్డు విషయానికొస్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే గార్డ్‌నర్‌ ఈ అవార్డును గెలుచుకుంది. డిసెంబర్‌ నెలలో భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఆష్లే.. ఈ సిరీస్‌లో 166.66 స్టయిక్‌ రేట్‌తో 115 పరుగులు చేసి 18.28 సగటున 7 వికెట్లు పడగొట్టింది. ఈ అవార్డు కోసం ఆష్లే.. న్యూజిలాండ్‌ సూజీ బేట్స్‌, ఇంగ్లండ్‌ చార్లీ డీన్‌ నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంది.

కాగా, పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ డిసెంబర్‌ మంత్‌ అవార్డు గెలుచుకున్న హ్యారీ బ్రూక్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్‌ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఏకంగా రూ.13.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement