‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’ | Hardik Pandya Comments After Mumbai Indians Won Match Vs KKR | Sakshi
Sakshi News home page

‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’

Mar 30 2026 7:56 AM | Updated on Mar 30 2026 8:36 AM

Hardik Pandya Comments After Mumbai Indians Won Match Vs KKR

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. గత 13 సీజన్లలో తొలి మ్యాచ్‌లో తమను ఓటములే పలకరించాయని, కానీ 14 ఏండ్ల తర్వాత ఆ దేవుడు తమను కరుణించాడని పేర్కొన్నాడు. 

సీజన్‌లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌, కేకేఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కేకేఆర్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం కెప్టెన్ పాండ్యా మాట్లాడాడు. 

‘ఇది ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విజయం. గత 13 సీజన్లను ఓటమితోనే ప్రారంభించాం. కానీ ప్రతీ సీజన్ ప్రారంభ మ్యాచ్‌ను గెలవాలనే బలమైన సంకల్పంతోనే బరిలోకి దిగేవాళ్లం. 2013 నుంచి 2025 వరకు మాకు ఓటములే ఎదురయ్యాయి. కేకేఆర్‌పై విజయం పట్ల మా జట్టు పూర్తి సంతోషంగా ఉంది. ఎందుకంటే భారీ లక్ష్యాలను ఛేధించడం అంత సులువు కాదు. 

తొలి ఇన్నింగ్స్‌లో కేకేఆర్ పవర్ ప్లేలో మా బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో భారీగా పరుగులు వచ్చాయి. కానీ పవర్ ప్లే తర్వాత మా బౌలర్లు గాడిన పడి కేకేఆర్ మరింత భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారు. లేదంటే కేకేఆర్ 240 లేదా 250కి పైగా స్కోరు చేసి ఉండేదేమో. 

కళ్ల ముందు భారీ టార్గెట్ కనిపిస్తున్నప్పటికీ మా టాప్ ఓపెనర్లు రోహిత్‌- రికిల్‌టన్‌లు తమ బ్యాటింగ్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా రోహిత్ భాయ్ బ్యాట్ నుంచి కొన్ని అద్భుతమైన షాట్లు వచ్చాయి. అదే సమయంలో రికిల్‌టన్ కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే డికాక్‌ను కాదని రికిల్‌టన్‌కు అవకాశమివ్వడం రిస్క్ అనిపించినా అతడు తన బ్యాటింగ్‌తో మా అనుమానాలను పటాపంచలు చేశాడు. 

ఇక రోహిత్ భయ్యా గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు. టీ20 క్రికెట్‌కు గ్యాప్ వచ్చినప్పటికీ  గ్రౌండ్ నలువైపులా షాట్లు ఆడుతూ పాత రోహిత్‌ను గుర్తుకుతెచ్చాడు. రోహిత్ శర్మ కేవలం మా జట్టు ఆటగాడు మాత్రమే కాదు అతను మాకు మార్గనిర్దేశకుడు. ఎన్నో ఏళ్లుగా ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ శార్దూల్ ఠాకూర్ తన సొంత జట్టుకు ఆడడం లేదన్న ఫీలింగ్ అతనికి ఉండేది. 

నాకు తెలిసి ఇవాళ్టితో శార్దూల్‌కు ఆ ఫీలింగ్ పోయి ఉండాలి (నవ్వుతూ). ఒక నిఖార్సైన ఆల్‌రౌండర్‌కు అర్థం శార్దూల్ ఠాకూర్‌. ఇవాళ మ్యాచ్ హీరో శార్దూల్ అని కచ్చితంగా చెప్పగలను’ అంటూ ముగించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన శార్దూల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ గెలుచుకున్నాడు.

చదవండి: కోహ్లీ రికార్డు బ‌ద్దలు కొట్టిన రోహిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement