ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 2012 సీజన్ తర్వాత తాము ఆడిన తొలి మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో మెరిశాడు. క్రీజులో తాను ఉన్నాడంటే పరుగులు రావాల్సిందే.
38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన సహచరుడు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. టీ20 క్రికెట్‌లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానానికి చేరుకున్నాడు. గతంలో డెక్కన్ చార్జర్స్‌తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున కేకేఆర్‌పై రోహిత్ శర్మ 36 మ్యాచ్‌ల్లో 1161 పరుగులు సాధించాడు.
ఇక కేకేఆర్‌తో మొత్తం 36 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరఫున 6 మ్యాచ్‌ల్లో 116 పరుగులు, ముంబై ఇండియన్స్ తరఫున 30 మ్యాచ్‌ల్లో 1045 పరుగులు సాధించడం విశేషం.ఇంతకముందు విరాట్ కోహ్లీ చెన్నై సూపర్‌కింగ్స్‌పై 36 మ్యాచ్‌ల్లో 1160 పరుగులు చేశాడు. తాజాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో రోహిత్ 78 పరుగులు చేయడంతో కోహ్లీ రికార్డు బ్రేక్ చేసినట్లయింది.
అయితే కోహ్లీ పంజాబ్ కింగ్స్‌పై (36 మ్యాచ్‌ల్లో 1159 పరుగులు), ఢిల్లీ క్యాపిటల్స్‌పై( 32 మ్యాచ్‌ల్లో 1154 పరుగులు) సాధించాడు. అయితే ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ లేదా ఢిల్లీతో ఎప్పుడు ఆడినా ఈసారి రోహిత్ శర్మను కోహ్లీ దాటేసి మరోసారి నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించనున్నాడు.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. రహానే (67), రఘువంశీ (51), రింకూ సింగ్ (33 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, పాండ్యా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికిల్‌టన్ (81), రోహిత్ శర్మ (78) దూకుడుతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది.
చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది!


