
టి20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శన మాజీ క్రికెటర్లను కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ (74) కూడా కోహ్లీ ఆటకు ఫిదా అయ్యాడు. పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ బ్యాటింగ్ చూస్తే దేవుడు పాట పాడినంత మధురంగా అనిపించిందని చాపెల్ కొనియాడాడు. సిడ్నీ హెరాల్డ్ పత్రిక కాలమ్‌లో చాపెల్ కోహ్లి గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చాడు.
''ఎంతో నైపుణ్యం ఉన్న పాక్ బౌలింగ్ లైనప్ ను కవ్విస్తూ సాగిన కోహ్లీ బ్యాటింగ్ మెల్బోర్న్ మైదానంలో అందంగా ఆవిష్కృతమైంది. ప్రత్యర్థి బౌలింగ్ దాడులను ఇంత నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన ఆటగాడు మునుపటి తరంలోనూ ఎవరూ లేరు. నాకు తెలిసినంత వరకు కోహ్లీ భారత క్రికెట్లో అత్యంత పరిపూర్ణమైన ఆటగాడు. గొప్ప చాంపియన్లు అనదగ్గ ఆటగాళ్లు మాత్రమే కోహ్లీలాగా తెగువను, యుక్తిని కలగలిపి ఆడగలరు. పాతతరం ఆటగాడైన టైగర్ పటౌడీ ఈ విషయంలో కోహ్లీకి దరిదాపుల్లోకి వస్తాడంటూ'' పేర్కొన్నాడు.