
Azadi Ka Amrit Mahotsav: భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట కేంద్ర ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంబురాల్లో భాగంగా ఓ క్రికెట్ మ్యాచ్‌ను కూడా నిర్వహించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీమిండియా, వరల్డ్ ఎలెవెన్ జట్ల మధ్య ఆగస్టు 22న ఈ మ్యాచ్ నిర్వహించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై కేంద్ర సాంస్కృతిక శాఖ బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్ ప్రతిపాదనను బీసీసీఐకి చెందిన ఓ కీలక అధికారి సైతం ధృవీకరించారు. మ్యాచ్ నిర్వహణకు బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదని, వరల్డ్ ఎలెవెన్ జట్టును బరిలోకి దించాలంటే కనీసం 13 నుంచి 14 మంది అంతర్జాతీయ ఆటగాళ్ల అవసరం ఉంటుందని, వాళ్లు అందుబాటులో ఉంటారో లేదో పరిశీలించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ఈ సీజన్ మొత్తానికి సంబంధించి ఇదివరకే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయా దేశాలకు (విదేశీ క్రికెటర్లు) చెందిన క్రికెట్ బోర్డులతో మాట్లాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రం మ్యాచ్ జరపాలనుకుంటున్న సమయానికి ఇంగ్లండ్ దేశవాళీ సీజన్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతాయని, ఇందులో పాల్గొనే ఆటగాళ్లను ఆడించాలనుకుంటే వారికి తగిన పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, ఆ విషయమై త్వరలో జరిగే ఐసీసీ సమావేశాల్లో డిస్కస్ చేస్తామని వివరించారు.
చదవండి: T20 WC 2022: అసలు తమ అత్యుత్తమ జట్టు ఏదో భారత్‌కు తెలుసా? ఏమిటో!