10 కోట్ల చీర్‌లీడర్‌.. మాక్స్‌వెల్‌ స్పందన

Glenn Maxwell Says In Media For Such Statements On Sehwag Comments - Sakshi

మెల్‌బోర్న్‌: టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనపై చేసిన విమర్శలపై ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ స్పందించాడు. తనపై ఉన్న అయిష్టాన్ని వెళ్లగక్కడం వీరూకు ఇష్టమని, తను ఏదైనా మాట్లాడగలడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 సీజన్‌లో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు తరఫున బరిలోకి దిగిన అతడు 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేక చతికిలబడ్డాడు. దీంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ‘‘10 కోట్ల చీర్‌లీడర్‌’’ అంటూ సెహ్వాగ్‌ మాక్స్‌వెల్‌ను ఎద్దేవా చేశాడు. కోట్లు పెట్టి కొన్న జట్టుకు న్యాయం చేయలేదనే ఉద్దేశంతో, యూఏఈలో అత్యంత ఖరీదైన వెకేషన్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేశాడంటూ విమర్శించాడు. (చదవండి: ‘రాహుల్‌ కెప్టెన్సీ అద్భుతమని చెప్పలేను’)

ఇక వీరూ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన మాక్స్‌వెల్‌.. ది వెస్ట్రన్‌ ఆస్ట్రేలియన్‌తో మాట్లాడుతూ.. ‘‘మరేం పర్లేదు. వీరూ నా మీద ఉన్న అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. తనకు నచ్చింది మాట్లాడే హక్కు అతడికి ఉంది. ఇలాంటి వ్యాఖ్యలతో తను తరచుగా మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. బాగుంది. దీని గురించి నేను పట్టించుకోను’’ అని పేర్కొన్నాడు. కాగా మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌ల ప్రదర్శనపై తీవ్ర అసహనంతో ఉన్న పంజాబ్‌ జట్టు యాజమాన్యం వారిపై వేటు వేసేందుకు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... భారీ మార్పులు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సీజన్‌లో తొలి అర్ధభాగంలో ఒకే ఒక్క మ్యాచ్‌ గెలిచిన పంజాబ్‌.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. అయితే చివరి రెండు మ్యాచుల్లో ఓడటంతో లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top