మరో 7 రోజుల్లో ఫుట్‌బాల్ ప్రపంచకప్
విశ్వవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ‘ఫిఫా’ వరల్డ్‌కప్ మరో ఏడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పలు విప్లవాత్మక మార్పులు చేసేందుకు ‘ఫిఫా’ సిద్ధమైంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (ఐఎప్‌ఏబీ)తో కలిసి మెరుగైన నిబంధనలను రూపొందించింది. గతంలో మాదిరిగా ప్లేయర్లు సమయాన్ని వృథా చేయడానికి వీలు లేకుండా... ఆటలో మరింత పోటీతత్వం పెంచేందుకు ఈ నిబంధనలు ఉపకరించనున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం... – సాక్షి, క్రీడావిభాగం
» బంతి మైదానం వెలుపలికి వెళ్తే... దాన్ని తిరిగి 5 సెకన్ల లోపు గ్రౌండ్‌లోకి తేవాల్సి ఉంటుంది. ఏ ఆటగాడైనా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తే... దానికి బదులుగా ప్రత్యర్థి జట్టుకు ‘త్రో ఇన్’ అవకాశం ఇవ్వనున్నారు. గతంలో ఆటగాళ్లు తమ ప్లేయర్లు ఎక్కడ ఉన్నారో చూసుకొని బంతిని త్రో చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు.
» ‘గోల్ కిక్’ల సమయాన్ని కూడా 5 సెకన్లకు పరిమితం చేశారు. కావాలని సమయాన్ని వృథా చేస్తే ప్రత్యర్థి జట్టుకు కార్నర్ కిక్ లభిస్తుంది.
» ఎవరైనా ఆటగాడు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాలంటే డిజిటల్ డిస్‌ప్లేపై ప్రదర్శించిన 10 సెకన్లలోపు ఒక ప్లేయర్ మైదానాన్ని వీడి అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడు రావాలి. సమయాన్ని పాటించని జట్టు ఒక నిమిషం పాటు 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి ఉంటుంది.
» ప్లేయర్లు చికిత్స నిమిత్తం మైదానాన్ని వీడితే... తిరిగి గ్రౌండ్‌లోకి రావడానికి ముందు ఒక నిమిషం పాటు బయటే ఉండాలి. తీవ్రమైన గాయాల విషయంలో ఇందులో సడలింపులు ఇవ్వనున్నారు.
» మైదానంలో ప్లేయర్లు తమ నోటిని చేత్తో మూయడం గానీ అడ్డంగా ఎలాంటి వస్తువులు పెట్టుకోవడం గానీ చేయరాదు. ఇది కేవలం వరల్డ్‌కప్‌లో మాత్రమే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యాచ్‌లలో అమలు చేయనున్నారు. జాత్యహంకారాన్ని అరికట్టేందుకు ‘ఫిఫా’ ఈ నిబంధన తీసుకొచ్చింది. దీన్ని అతిక్రమిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా ‘రెడ్ కార్డ్’ చూపిస్తారు.
» మ్యాచ్‌కు రెండు చొప్పున ‘హైడ్రేషన్’ విరామాలు లభించనున్నాయి. 3 నిమిషాల ఈ బ్రేక్స్‌ను ఆట ఆరంభమైన 20 నిమిషాల తర్వాత తీసుకోవచ్చు.


