Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే!

FIFA WC 2022: Ronaldo Journey Ends In Tears Messi Ahead Fans Emotional - Sakshi

FIFA World Cup 2022- Cristiano Ronaldo: ఇద్దరక్కలు.. ఓ అన్న.. ఇంట్లో నాలుగో సంతానం. నిజానికి అప్పటికే పేదరికంలో మగ్గుతున్న కారణంగా ఆ తల్లి నాలుగో బిడ్డను కనకూడదు అనుకుంది. అబార్షన్‌ చేయించుకోవాలనుకుంది. కానీ, దేవుడు అలా జరుగనివ్వలేదు. ఆ బిడ్డ భూమ్మీద పడ్డాడు. ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించాడు. స్టార్‌ ఫుట్‌బాలర్‌గా ఎదిగి.. తల్లిని గర్వపడేలా చేశాడు. లెక్కకు మిక్కిలి అభిమానులు, లెక్కలేనంత డబ్బు!

తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్నో రికార్డులు సాధించిన రారాజు.. మరీ ఇలా, ఇంత ఘోరంగా తన ప్రయాణం ముగిసిపోతుందని ఊహించి ఉండడు! ఇంతటి అవమానకర పరిస్థితుల్లో ‘ఆఖరి మ్యాచ్‌’ను ఆడాల్సి వస్తుందనే ఊహ కూడా కనీసం అతడి దరికి చేరి ఉండదు!  కెరీర్‌లో ఒక్క ప్రపంచకప్‌ టైటిల్‌ అయినా ఉండాలని అతడు ఆశపడ్డాడు. అందుకు తను వందకు వందశాతం అర్హుడు కూడా! కానీ విధిరాత మరోలా ఉంది! 

నువ్వు ఎన్ని అంతర్జాతీయ గోల్స్‌ చేస్తేనేం? ఐదు ప్రతిష్టాత్మక బాలన్‌ డీఓర్‌ అవార్డులు గెలిస్తేనేం? ఎన్నెన్ని చాంపియన్స్‌ లీగ్‌ మెడల్స్‌ సాధిస్తేనేం? మూడు దేశాల్లో క్లబ్‌ టైటిల్స్‌ గెలిచిన ఆటగాడివి అయితేనేం? ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన ఫుట్‌బాలర్‌గా నీరాజనాలు అందుకుంటేనేం?

ఈ ఒక్క లోటు నిన్ను, నీ అభిమానులను జీవితాంతం వేదనకు గురిచేయడం ఖాయమన్నట్లుగా.. గుండెకోతను మిగిల్చింది. చిన్నపిల్లాడిలా అతడు వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు చూసి అభిమానుల గుండెలు బద్దలయ్యాయి. ‘‘మరేం పర్లేదు రొనాల్డో.. నువ్వు ఎప్పటికీ మా దృష్టిలో చాంపియన్‌వే’’ అని పైకి చెబుతున్నా.. హృదయాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న బాధ వాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు!- సాక్షి, వెబ్‌డెస్క్‌


తల్లితో రొనాల్డో

వీళ్లకు ఉన్నంత పాపులారిటీ ఎవరికీ లేదు!
నిజానికి ఆధునిక ఫుట్‌బాల్‌లో స్టార్లు ఎవరంటే ఠక్కున గుర్తుకువచ్చే పేర్లు.. లియోనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో. సాకర్‌ గురించి పెద్దగా తెలియనివాళ్లకు కూడా వీరి పేర్లు సుపరిచితమే అనడంలో సందేహం లేదు. కోట్లాది మంది అభిమానం చూరగొన్న.. చూరగొంటున్న  మెస్సీ, రొనాల్డో ఆటలో తమకు తామే సాటి. తమకు తామే పోటీ. ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది మేటి ఫుట్‌బాలర్లు ఉన్నా వీరిద్దరికి దక్కినంత పాపులారిటీ మరెవరికి దక్కలేదనడం అతిశయోక్తి కాదు. 


గర్ల్‌ఫ్రెండ్‌, తమ పిల్లలతో ఇలా

అదొక్కటే లోటు!
చాంపియన్స్‌ లీగ్‌ సహా ఇతర క్లబ్‌ టోర్నీలలో తమదైన ఆట తీరుతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన అర్జెంటీనా స్టార్‌ మెస్సీ, పోర్చుగల్‌ మేటి ఆటగాడు రొనాల్డో.. తమ కెరీర్‌లో ఎన్నెన్నో రికార్డులు సాధించారు. అరుదైన ఘనతలు తమ ఖాతాలో వేసుకున్నారు. పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు.. ఎందులోనూ వీరికి లోటు లేదు. అయితే, విచిత్రంగా ఈ ఇద్దరు ఫుట్‌బాల్‌ స్టార్లు తమ కెరీర్‌లో జాతీయ జట్టు తరపున ఇప్పటి వరకు ఒక్క వరల్డ్‌కప్‌ టైటిల్‌ కూడా గెలవకపోవడం గమనార్హం.


మెస్సీ, రొనాల్డో

మెస్సీ ముందడుగు.. పాపం రొనాల్డో
అర్జెంటీనా ఇప్పటి వరకు రెండు సార్లు(1978, 1986) ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడగా.. పోర్చుగల్‌ ఖాతాలో ఒక్క టైటిల్‌ కూడా లేదు. ఈ నేపథ్యంలో ఖతర్‌ వేదికగా ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో ఈ ఇద్దరు కెప్టెన్లు తమ జట్లను ముందుకు నడిపి ఫైనల్లో తలపడితే చూడాలని, ఏ ఒక్కరు గెలిచినా చరిత్ర సృష్టించడం ఖాయమంటూ ఫుట్‌బాల్‌ అభిమానులు అంచనాలు వేశారు.

అంతేగాక 37 ఏళ్ల రొనాల్డో, 35 ఏళ్ల మెస్సీ తమ కెరీర్‌లో ఇదే ఆఖరి ప్రపంచకప్‌ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకరికి ఈ ఏడాది టోర్నీ చిరస్మరణీయం కావాలని కోరుకున్నారు.  క్వార్టర్‌ ఫైనల్లో నెదర్లాండ్స్‌పై అర్జెంటీనా గెలుపుతో మెస్సీ చిరకాల కల నెరవేరేందుకు ముందుడుగు పడగా.. మొరాకో చేతిలో పోర్చుగల్‌ ఓటమితో రొనాల్డో వరల్డ్‌కప్‌ ప్రయాణానికి తెరపడింది. 

అరుదైన రికార్డు
ఫిఫా ప్రపంచకప్‌-2022లో ఘనాతో ఆరంభ మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలచడం ద్వారా రొనాల్డో తన ఖాతా తెరిచాడు. తద్వారా ఐదు ప్రపంచకప్‌లలోనూ గోల్‌ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్‌ స్టార్‌ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్‌లలో గోల్‌ చేశాడు. ఓవరాల్‌గా 8 గోల్స్‌ సాధించాడు.

ఇక గ్రూప్‌- హెచ్‌లో ఉన్న పోర్చుగల్‌ ఈ మ్యాచ్‌లో 3-2తో విజయం సాధించింది. ఆ తర్వాత మాజీ చాంపియన్‌ ఉరుగ్వేను 2-0తో ఓడించింది. అనంతరం దక్షిణా కొరియా చేతిలో 2-1 ఓటమి పాలైనప్పటికీ గ్రూప్‌ టాపఱ్‌గా ఉన్న పోర్చుగల్‌ రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించింది.

అవమానకర రీతిలో..
అయితే, ఈ మ్యాచ్‌ సందర్భంగా దక్షిణా కొరియా ఆటగాడితో రొనాల్డో వాగ్వాదం వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలో ప్రిక్వార్టర్స్‌లో భాగంగా స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో కెప్టెన్‌, స్టార్‌ స్ట్రయికర్‌ అయిన రొనాల్డోను పక్కనపెట్టడం ఫ్యాన్స్‌ అవమానకరంగా భావించారు.

ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో వచ్చిన యువ ప్లేయర్‌ గొంకాలో రామోస్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో మెరవగా.. స్విస్‌పై పోర్చుగల్‌ 6-1తో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో స్విస్‌తో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చిన రొనాల్డో క్వార్టర్స్‌ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీసుకు డుమ్మా కొట్టినట్లుగా వార్తలు వచ్చాయి.

అవమానం తట్టుకోలేకే ఇలా చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కీలక మ్యాచ్‌కు రొనాల్డోను పక్కనపెట్టడం పట్ల అతడి గర్ల్‌ఫ్రెండ్‌ జార్జినా కూడా అసహనం వ్యక్తం చేస్తూ పోస్ట్‌ చేయగా.. 50 లక్షలకు పైగా మంది ఆ పోస్టును లైక్‌ చేసి రొనాల్డోకు మద్దతుగా నిలిచారు.

అయినా, మేనేజ్‌మెంట్‌ తీరు మారలేదు. మొరాకోతో క్వార్టర్‌ మ్యాచ్‌ ఆరంభంలోనూ రొనాల్డోను ఆడించలేదు. 51 నిమిషంలో అతడిని సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా బరిలోకి దించింది. ఈ క్రమంలో తనకు గోల్‌ కొట్టే అవకాశం రాగా.. మొరాకో గోల్‌ కీపర్‌ అడ్డుపడటంతో రొనాల్డోకు నిరాశే మిగిలింది.

సెమీస్‌, ఆపై ఫైనల్‌ చేరి టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించాలన్న పోర్చుగల్‌ సారథి కల ఇలా ముగిసిపోయింది. నిజానికి 2014లో ఫైనల్‌ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాలేదు. అయితే, రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. ఇప్పుడు కూడా అంతే!

ఎంతటి మొనగాడు అయితేనేం?!
18 ఏళ్ల వయసులో ఫిఫా వరల్డ్‌కప్‌-2003లో తొలిసారిగా మెగా ఈవెంట్‌లో ఆడిన రొనాల్డోకు టైటిల్‌ లేకుండానే కెరీర్‌ ముగించాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఓ ప్రెస్‌మీట్‌లో కూల్‌డ్రింక్‌ బాటిల్‌ను పక్కకు జరిపి.. వాటర్‌ గ్లాస్‌ అందుకున్నందుకే సదరు కంపెనీ బ్రాండ్‌ వాల్యూ అమాంతం పడిపోయేంత ప్రభావం చూపగల.. పాపులర్‌ ఆటగాడు ఇలా ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని చిన్నపిల్లాలడిగా కన్నీటిపర్యంతం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు సగటు అభిమాని. ఎంతటి మొనగాడికైనా గడ్డుకాలం అంటే ఇలాగే ఉంటుందేమోననంటూ కామెంట్లు చేస్తున్నారు.
-సుష్మారెడ్డి, యాళ్ల

చదవండి: Saina Nehwal: తన మొహం కూడా చూడనంటూ పెదవి విరుపులు! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..
Ishan Kishan: ఇషాన్‌ కిషన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ పోస్ట్‌ వైరల్‌! ఇంతకీ ఆమె ఎవరంటే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top