IND Vs BAN: వర్షం రాకపోయుంటే.. టీమిండియా గెలిచేదా!

Fans Raise Doughts If-Rain Not-Come Team India Would Win Vs BAN - Sakshi

టి20 ప్రపంచకప్‌లో వర్షం అందరికి చేటు చేస్తే టీమిండియాకు మాత్రం మేలు చేసింది. ఈ ప్రపంచకప్‌లో సూపర్‌-12లో 12 జట్లు ఉంటే.. 13వ జట్టుగా వరుణుడు ఎంటరయ్యాడంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ తెగ వైరల్‌ అయ్యాయి. ముఖ్యంగా గ్రూఫ్‌-1లో ఏకంగా మూడు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఇందులో ఇంగ్లండ్‌-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ కూడా ఉంది. ఇక ఇంగ్లండ్‌ను కొంపముంచింది కూడా వరుణుడే. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో గెలుపు దిశగా పయనిస్తోన్న ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ విజయం అందుకుంది. 

ఇక గ్రూఫ్‌-2లోని జట్లకు వరుణుడు పెద్దగా ఆటంకం కలిగించలేదు. కేవలం సౌతాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్‌ మాత్రమే రద్దయింది. ఇక బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం టీమిండియాకు వరుణుడు మేలు చేశాడనే చెప్పాలి. సాధారణంగా ఇప్పుడున్న స్థితిలో మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో వర్షం మొదలైతే ఒక పట్టానా వదలడం లేదు. 

కానీ టీమిండియా విషయంలో మాత్రం అలా జరగలేదని చెప్పొచ్చు. భారత్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఒక్కసారి కూడా ఆటకు వర్షం అంతరాయం కలిగించలేదు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగుల భారీ స్కోరు చేసింది. కోహ్లి, రాహుల్‌లు అర్థసెంచరీలతో రాణించారు. 

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ఊహించని షాక్‌ ఇచ్చింది. ముఖ్యంగా బంగ్లా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ దూకుడైన ఆటతీరు కనబరుస్తూ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. చూస్తుండగానే బంగ్లాదేశ్‌ స్కోరు 6 ఓవర్లలో 60 పరుగులకు చేరింది. 21 బంతుల్లోనే లిటన్‌ దాస్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 60 పరుగుల్లో 50 పరుగులు అతనివే అంటే విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా బౌలర్ల లయ తప్పిన బౌలింగ్‌తో మరికొద్దిసేపు ఇలాగే ఉంటే మ్యాచ్‌ బంగ్లాదేశ్‌ చేతుల్లోకి వెళ్లిపోయేదే.

కానీ ఇదే సమయంలో వర్షం పడడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అప్పటికి మ్యాచ్‌ బంగ్లాదేశ్‌వైపే ఉంది. ఎందుకంటే మ్యాచ్‌కు వరుణుడి ముప్పు ఉంటుందని ముందే గ్రహించిన బంగ్లాదేశ్‌ అందుకు తగ్గట్లుగానే ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. వర్షం పడే సమయానికి ఏడు ఓవర్లలో చేయాల్సిన పరుగుల కన్నా 17 పరుగులు చేయడం బంగ్లాకు కలిసొచ్చింది. వర్షం తగ్గకపోయుంటే బంగ్లానే విజేతగా నిలిచేది.

అయితే ఈసారి టీమిండియాకు కలిసొచ్చాడు వరుణుడు. వర్షం బ్రేక్‌ ఇవ్వడంతో ఆట ప్రారంభమైంది. 9 ఓవర్లలో 85 పరుగులు కొట్టాల్సిన దశలో బంగ్లా బ్యాటర్లు దూకుడు కనబరుస్తూ వచ్చిన బ్యాట్స్‌మెన్లు వచ్చినట్లు బాదడంతో స్కోరు పరిగెత్తడం మొదలైంది. మధ్యలో వరుసగా వికెట్లు పడడంతో మ్యాచ్‌ టీమిండియావైపు తిరిగింది. ఈ దశలో నురుల్‌ హసన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా అర్ష్‌దీప్‌ సింగ్‌ సూపర్‌ బౌలింగ్‌ చేయడంతో టీమిండియా ఐదు పరుగుల తేడాతో విజయం అందుకుంది.

నిజానికి వర్షం రాకపోయుంటే టీమిండియా ఓడిపోయేదా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే టీమిండియా చేసిన స్కోరు 184 పరుగులు. ఏ జట్టైనా అంత పెద్ద టార్గెట్‌ను చేజ్‌ చేస్తుందంటే ఒత్తిడి నెలకొనడం సహజం. అయితే బంగ్లా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ మెరుపు ఆరంభం ఇవ్వడం అభిమానులను సంశయంలో పడేసింది. ఏదైతేనేం మొత్తానికి బంగ్లాదేశ్‌పై విజయం సాధించిన టీమిండియా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక టీమిండియా సూపర్‌-12లో తన చివరి మ్యాచ్‌ను జింబాబ్వేతో ఆదివారం (నవంబర్‌ 6న) ఆడనుంది. 

చదవండి: వ్యాట్‌ ఏ మ్యాచ్‌.. చివరి ఓవర్‌లో గూస్‌ బంప్స్‌..

IND Vs BAN: ఓడినా వణికించింది

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top