తిలక్‌ వర్మను అవమానించిన అర్ష్‌దీప్‌ సింగ్‌! | Fans Lambast Arshdeep Singh As He calls Tilak Varma oye andhere | Sakshi
Sakshi News home page

తిలక్‌ వర్మను ఘోరంగా అవమానించిన అర్ష్‌దీప్‌ సింగ్‌!

May 15 2026 11:41 AM | Updated on May 15 2026 12:13 PM

Fans Lambast Arshdeep Singh As He calls Tilak Varma oye andhere

టీమిండియా స్టార్‌, పంజాబ్‌ కింగ్స్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అతడి వ్యవహారశైలిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండాలని.. సహచర ఆటగాడి పట్ల సోదరభావం కలిగి ఉండాలే తప్ప.. అహంకారం పనికిరాదని చురకలు అంటిస్తున్నారు.

కాగా ఐపీఎల్‌-2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌- పంజాబ్‌ కింగ్స్‌ మధ్య గురువారం మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే. ధర్మశాల వేదికగా మ్యాచ్‌ ఆరంభానికి ముందు అర్ష్‌దీప్‌ సింగ్‌ హోటల్‌ లాబీలో ఓ వ్లాగ్‌ చేశాడు. ఇందులో భాగంగా ముంబై బ్యాటర్‌, టీమిండియా స్టార్‌ తిలక్‌ వర్మను ఉద్దేశించి వివక్షపూరిత వ్యాఖ్యలు చేశాడు.

ఓయ్‌.. నల్లోడా
తిలక్‌ను.. ‘ఓయ్‌.. అంధేరే(నల్లోడా)’ అని సంబోధిస్తూ అతడిని ‘రంగు’ను ఉద్దేశించి హేళన చేశాడు. ఈ క్రమంలో తిలక్‌ కాస్త అసహనంగా కదులుతూ.. అర్ష్‌దీప్‌తో సంభాషణ ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అర్ష్‌దీప్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

నీకసలు బుద్ధి ఉందా?
దీంతో అర్ష్‌దీప్‌ సింగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ‘‘నీకసలు బుద్ధి ఉందా? సహచర ఆటగాడి శరీర రంగును ప్రస్తావిస్తూ నీచంగా మాట్లాడుతావా? ఫన్‌ పేరిట నువ్వు తిలక్‌ను ఘోరంగా అవమానించావు. ఇది ఎంత మాత్రం సరికాదు’’ అని నెటిజన్లు చివాట్లు పెడుతున్నారు.

అయితే, అర్ష్‌దీప్‌ అభిమానులు మాత్రం.. ‘‘తిలక్‌తో ఉన్న చనువు కారణంగా.. సరదాగా అలా అని ఉంటాడు’’ అని సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా అర్ష్‌దీప్‌ సింగ్‌ వ్లాగుల కారణంగా పంజాబ్‌ కింగ్స్‌ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే.

తరచూ వివాదాలు
ఆ జట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ విమానంలో ‘వేపింగ్‌’ (ఇ- సిగరెట్‌ తాగడం) చేసినట్లుగా ఉన్న వీడియోను అర్ష్‌దీప్‌ పంచుకున్నాడు. కాగా భారత్‌లో దీనిపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీడియో వైరల్‌ కావడంతో పంజాబ్‌ జట్టు చిక్కుల్లో పడే పరిస్థితి తలెత్తింది. 

అయితే, అతడు నిజంగా వేపింగ్‌ చేయలేదని.. అలా అభినయించాడని సన్నిహిత వర్గాలు తెలపడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇక బీసీసీఐ సైతం ఆటగాళ్లు జట్టుతో ఉన్న సమయంలో వ్లాగులు చేయడంపై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ముంబై పంజాబ్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో తిలక్‌ వర్మ 33 బంతుల్లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు పంజాబ్‌ తరఫున అర్ష్‌దీప్‌ సింగ్‌.. 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు.

చదవండి: కీరన్‌ పొలార్డ్‌కు భారీ షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement