Shahid Afridi Vs Danish Kaneria: షాహిద్‌ అఫ్రిది ఒక క్యారెక్టర్‌ లెస్‌.. అబద్ధాల కోరు : పాక్‌ మాజీ స్పిన్నర్‌

Ex-Pak Cricketer Danish Kaneria Says Shahid Afridi CharacterLess-Big Liar - Sakshi

''నేను పాకిస్తాన్‌ జట్టు నుంచి బయటికి వెళ్లడానికి షాహిద్‌ అఫ్రిది ప్రధాన కారకుడు.. అతనికి క్యారెక్టర్‌ అనేదే లేదు. నా గురించి జట్టు సభ్యులకు తప్పుగా చెప్పి వారి ముందు దోషిని చేశాడు. అతని నమ్మకద్రోహం నేను ఎప్పటికి మరిచిపోనూ''
-పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ దానిష్‌ కనేరియా

41 ఏళ్ల దానిష్‌ కనేరియా.. పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదిపై నిప్పులు చెరిగాడు. ఏఎన్‌ఐ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తాను జట్టు నుంచి బహిష్కరణకు గురవ్వడంలో అఫ్రిది పాత్ర ఉందంటూ తెలిపాడు. ''పాకిస్తాన్‌కు క్రికెట్‌ ఆడినంత కాలం షాహిద్‌ అఫ్రిది నన్ను హేళన చేసేవాడు. తోటి ఆటగాళ్ల ముందు అవమానపరుస్తూ మాట్లాడేవాడు. ఇద్దరం కలిసి చాలా ఏళ్లపాటు పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాం. అతను కెప్టెన్‌గా ఉన్నప్పుడు నన్ను ఎక్కువగా బెంచ్‌కే పరిమితం చేసేవాడు. దాని మూలంగా చాలా వన్డే మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. అంతేకాదు నేను హిందువునంటూ.. ఈ దేశంలో అతనికి చోటు లేదని..  జట్టు నుంచి బహిష్కరించాలని సహచరులకు నూరిపోసేవాడు.

అతనొక అబద్దాల కోరు, అందరిని ప్రభావితం చేసే వ్యక్తి.. ఇంకా చెప్పాలంటే ఒక క్యారెక్టర్‌ లేని మనిషి. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా క్రికెట్‌పైనే ఫోకస్‌ చేసేవాడిని. జట్టులో ఉన్నంతకాలం నన్ను ద్వేషించేవాడు. నేనంటే ఎందుకంత అసూయ అనేది నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఒక్కటి చెప్పగలను. పాకిస్తాన్‌ జట్టుకు ఆడడం నా అదృష్టంగా భావిస్తా.. నా జీవితంలో అది గొప్పది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

2009లో ఇంగ్లీష్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌ ప్రో లీగ్‌లో భాగంగా కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్‌ ఆరోపణలు నిజమని తేలడంతో 2012లో ఇంగ్లీష్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ కూడా సమర్థించింది. కాగా తనపై విధించిన జీవతకాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ పీసీబీకి మొరపెట్టుకున్నాడు.

''క్రికెట్‌లో ఫిక్సింగ్‌ చేసిన ఎంతో మంది బయట యథేచ్చగా తిరుగుతున్నారు. కానీ నాపై ఉన్న నిషేధాన్ని మాత్రం పీసీబీ తొలగించలేదు. ఒక దేశానికి క్రికెట్‌ ఆడాను.. నిషేధం తొలగిస్తే ప్రైవేట్‌ లీగ్‌ల్లో ఆడాలని ఉంది. ఎలాగూ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడే అవకాశం పోయింది. పీసీబీని నేను అడిగేది ఒక్కటే.. నాపై బ్యాన్‌ ఎత్తేయండి.. నా పనేదో నేను చూసుకుంటా'' అని పేర్కొన్నాడు. కాగా దానిష్‌ కనేరియా 2000 సంవత్సరం నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. పాక్‌ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top