IPL 2022: సఫారీ పేసర్‌పై కన్నేసిన లక్నో జెయింట్స్‌

Every Team Wants Someone Like Rabada Says KL Rahul - Sakshi

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముహూర్తం సమీపిస్తున్న వేళ ప్రతి జట్టు ఆటగాళ్ల ఎంపిక విషయంలో నిమగ్నమై ఉంది. ఏ ఆట‌గాడిపై ఎంత డ‌బ్బు వెచ్చించాలనే అంశంలో ఆయా జట్లు కుస్తీ పడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేఎల్‌ సారధ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ కూడా తమ జట్టు సభ్యులను ఎంచుకునే పనిలో బిజీగా ఉంది. 

రాహుల్‌తో పాటు డ్రాఫ్టెడ్‌ ఆటగాళ్లుగా మార్కస్‌ స్టోయినిస్‌, రవి బిష్ణోయ్‌లను ఎంచుకున్న ఎల్‌ఎస్‌జే.. దక్షిణాఫ్రికా స్టార్ పేస‌ర్ క‌గిసో ర‌బాడపై కన్నేసినట్లు తెలుస్తోంది. వేలంలో ర‌బాడ‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆ జట్టు మాస్టర్ ప్లాన్ వేస్తుంద‌ని సమాచారం. ఇందుకోసం అతనిపై 12 కోట్ల వరకు వెచ్చించేందుకు సైతం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ విషయమై జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఓ క్లూను వదిలాడు. 

145 కిమీ పైగా వేగంతో నిప్పులు చెరిగే బౌలర్‌ను ఏ జట్టైనా కోరుకుంటుందని రబాడను ఉద్ధేశించి వ్యాఖ్యానించాడు. రబాడతో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్లైన మార్కో జన్సెన్‌, వాన్‌డెర్‌ డస్సెన్‌లపై కూడా లక్నో జట్టు కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురికి భారీ ధర చెల్లించి సొంతం చేసుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. 

కాగా, రబాడ గత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన విషయం తెలిసిందే. అతనికి ఢిల్లీ జ‌ట్టు 4.2 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. గత సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన ర‌బాడ, 15 వికెట్లతో పర్వాలేదనిపించగా.. అంతకుముందు సీజ‌న్‌(2020)లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఏకంగా 30 వికెట్ల‌ స‌త్తా చాటాడు. అతను 2019 సీజన్‌లో సైతం 25 వికెట్లతో రాణించాడు. 

ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 50 మ్యాచ్‌లు ఆడిన ఈ 26 ఏళ్ల స్టార్ పేస‌ర్ మొత్తం 76 వికెట్లు తీశాడు. అయితే, ఈ ఏడాది రిటెన్ష‌న్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అతన్ని వదులుకోవడం విశేషం. రిష‌బ్ పంత్, పృథ్వీ షా, అక్ష‌ర్ ప‌టేల్‌ను రీటైన్‌ చేసుకున్న ఢిల్లీ.. రబాడ సహచరుడు నోర్జేను అంటిపెట్టుకుంది. 
చదవండి: వెంకటేశ్‌ అయ్యర్‌కు అంత సీన్‌ లేదు.. గౌతమ్‌ గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top