Washington Sundar: వాషింగ్టన్‌ సుందర్‌కు లక్కీ ఛాన్స్‌.. ప్రతిష్టాత్మక టోర్నీలో.. థాంక్యూ అంటూ భావోద్వేగం

England Lancashire County Announces Signing up Washington Sundar - Sakshi

Washington Sundar: టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌ దేశవాళీ క్రికెట్‌ కౌంటీ మ్యాచ్‌లు ఆడే ఛాన్స్‌ కొట్టేశాడు. ఈ మేరకు భారత ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌తో ఒప్పందం చేసుకున్నట్లు లంకషైర్‌ జట్టు బుధవారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది.  

స్వాగత్‌ హై సుందర్‌..
ఈ సందర్భంగా స్వాగత్‌ హై అంటూ సుందర్‌కు ఆహ్వానం పలుకుతూ ఓ వీడియోను షేర్‌ చేసింది. ‘‘ఇండియన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌తో లంకషైర్‌ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. జూలై, ఆగష్టులో జరిగే కౌంటీ చాంపియన్‌షిప్‌ రాయల్‌ లండన్‌కప్‌లో అతడు భాగం కానున్నాడు’’ అని పేర్కొంది.

థాంక్స్‌ అంటూ భావోద్వేగం
ఈ విషయంపై స్పందించిన వాషింగ్టన్‌ సుందర్‌ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన లంకషైర్‌ మేనేజ్‌మెంట్‌, భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి ధన్యవాదాలు తెలిపాడు. ‘‘లంకషైర్‌ జట్టుతో కలిసి ఆడటం కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. ఇంగ్లండ్‌ గడ్డ మీద ఆడటం నాకొక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది. ఎమిరేట్స్‌ ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో ఆడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

కాగా ఐపీఎల్‌-2022 సందర్భంగా గాయపడిన సుందర్‌ ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. అతడు పూర్తిగా కోలుకోగానే లంకషైర్‌ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ యువ తమిళ ఆటగాడు భారత్‌ తరఫున 39 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 36 వికెట్లు పడగొట్టాడు. 

బౌలింగ్‌లో అతడు నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలు 6/87.టెస్ట్‌ ఎకానమీ 3.41. అదే విధంగా అతడు సాధించిన అత్యధిక స్కోరు 96 నాటౌట్‌. మొత్తం సాధించిన పరుగులు 369. ఇక లంకషైర్‌ విషయానికొస్తే ఆ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

అప్పట్లో వాళ్లు.. ఇప్పుడు ఈ యువ ప్లేయర్లు
గతంలో లంకషైర్ జట్టుకు ఫరూక్‌ ఇంజనీర్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, సౌరవ్ గంగూలీ, దినేశ్‌ మోంగియా, మురళీ కార్తీక్‌ లాంటి భారత దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. వారి తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌కు ఈ అవకాశం రాగా.. ప్రస్తుతం వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఆ జాబితాలో చేరిపోయాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top