రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ లెజెండ్‌ | England batter Bopara calls time on county career | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ ప్రకటించిన ఇంగ్లండ్‌ లెజెండ్‌

Apr 1 2026 3:21 PM | Updated on Apr 1 2026 3:44 PM

England batter Bopara calls time on county career

ఇంగ్లండ్ వెట‌ర‌న్ ఆల్‌రౌండ‌ర్ ర‌వి బొపారా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.  బొపారా తన 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికాడు. 2026 ఇంగ్లండ్‌ డొమెస్టిక్ సీజన్‌కు ముందే త‌న నిర్ణ‌యాన్ని బొపారా వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. 40 ఏళ్ల బొపారా గత కొంతకాలంగా కేవలం ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్, వన్డే కప్‌లలో మాత్రమే ఆడుతున్నాడు. 

బొపారా 2002లో ఎసెక్స్  త‌ర‌పున త‌న కౌంటీ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు 18 ఏళ్ల పాటు ఎసెక్స్ క్ల‌బ్‌కు అత‌డు ప్రాతినిథ్యం వ‌హించాడు. ఆ త‌ర్వాత 2020లో ససెక్స్‌తో అత‌డు ఒప్పం కుదుర్చుకున్నాడు. కానీ మూడేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ నార్తాంప్టన్‌షైర్ జ‌ట్టులో బొపారా చేరాడు. గ‌త రెండు సీజ‌న్‌ల‌లో అత‌డు నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. 

గత సీజన్‌లో నార్తాంప్టన్‌షైర్ జట్టు ఫైనల్‌కు చేరడంలో బొపారా కీల‌క పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్లో సర్రే జట్టుపై కేవలం 46 బంతుల్లోనే 105 పరుగుల  చేసి త‌న జ‌ట్టుకు అద్భుత‌మైన‌ విజయాన్ని అందించాడు. ఈ ఏడాది కూడా కౌంటీ క్రికెట్ ఆడేందుకు అత‌డికి ఆఫ‌ర్లు వ‌చ్చిన‌ప్ప‌టికి అత‌డు తిరస్క‌రించాడు. కానీ ఇప్పుడు పూర్తిగా రిటైర్మెంట్‌ ప్రకటించి అంద‌రికి షాకిచ్చాడు.  

ప్ర‌స్తుతం కరాచీ కింగ్స్ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొపారా.. త్వరలో కౌంటీ సీజ‌న్‌లో కామెంటేటర్‌గా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్‌ జాతీయ సెలెక్టర్‌ కావాలని బొపారా ఆశిస్తున్నాడు. కాగా బొపారా ఇంగ్లండ్‌ తరపున చివరగా 2015లో ఆడాడు.

అప్పటి నుంచి కేవలం డొమాస్టిక్‌ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్స్‌లో ఆడుతూ వచ్చాడు. అతడు ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ (2009, 2010), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015) జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లండ్‌ తరపున అతడు  13 టెస్టులు, 120 వన్డేలు, 38 టీ20లు ఆడాడు.

రవి బొపారా టెస్టు క్రికెట్‌లో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డును కలిగి ఉన్నాడు. 2009లో వెస్టిండీస్‌పై అతడు  ఈ ఫీట్ సాధించాడు. ఫస్ట్ క్రికెట్‌లో కూడా అతడి పేరిట దాదాపు 13,000 వేల పరుగులు ఉన్నాయి.
చదవండి: NZ vs SA: చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement