క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ (The Ashes 2025-26) నవంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే ఈ ఐదు మ్యాచ్‌ల మహా సంగ్రామం పెర్త్ టెస్ట్‌తో మొదలవుతుంది.
ఈ మ్యాచ్ కోసం 12 మంది సభ్యుల ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (నవంబర్ 19) ప్రకటించారు. ఈ జట్టులో అందరూ ఊహించిన విధంగానే స్టార్ ప్లేయర్లంతా చోటు దక్కించుకున్నారు. పేసర్ మార్క్ వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తుది జట్టులోకి వచ్చాడు.
గత కొంతకాలంగా ఫామ్‌లో లేని ఓలీ పోప్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు. పోప్ స్థానంలో బేకబ్ బేతెల్‌కు అవకాశం లభిస్తుందని చాలామంది అనుకున్నప్పటికీ అలా జరగలేదు. పోప్ తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 100, 90 పరుగులు చేశాడు.
ఆఫ్ స్పిన్నర్ షోయమ్ బషీర్ కూడా ఫైనల్-12లో చోటు దక్కించుకున్నాడు. అయితే ప్లేయింగ్-11 అతడి స్థానం ఇంకా ఖరారు కాలేదు. పెర్త్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది కాబట్టి బషీర్‌కు ప్లేయింగ్-11లో స్థానం దక్కకపోవచ్చు. వాస్తవానికి బషీర్ స్థానం కోసం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ పోటీపడ్డాడు.
చివరి నిమిషంలో మేనేజ్‌మెంట్ బషీర్‌కే ఓటు వేసింది. పెర్త్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందన్న సమాచారం ఉండటంతో ఇంగ్లండ్ మేనేజ్‌మెంట్ బలమైన పేస్ ఫోర్స్‌తో బరిలోకి దిగనుంది. ఈ జట్టులో మార్క్ వుడ్‌తో పాటు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్, గస్ అట్కిన్సన్ లాంటి పేస్ గన్స్‌కు చోటు దక్కింది. వీరికి తోడు కెప్టెన్ బెన్ స్టోక్స్ ఉండనే ఉన్నాడు.
బ్యాటింగ్ విభాగంలోనూ ఇంగ్లండ్ బలమైన జట్టునే ఎంపిక చేసుకుంది. హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్ లాంటి స్పెషలిస్ట్ బ్యాటర్లతో ఈ జట్టు బ్యాటింగ్ లైనప్ శక్తివంతంగా ఉంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ నవంబర్ 21వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది.
తొలి టెస్ట్‌కు 12 మంది సభ్యుల ఇంగ్లండ్ తుది జట్టు..
స్టోక్స్(కెప్టెన్), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బ్రూక్, కార్స్, క్రాలే, డకెట్, పోప్, రూట్, జేమీ స్మిత్ (వికెట్‌కీపర్), మార్క్ వుడ్


