
ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ఖాతాలో మరో భారీ రికార్డు చేరింది. బంతుల పరంగా (2832) టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఉండేది.
బాబర్ 62 ఇన్నింగ్స్‌ల్లో 3806 బంతులు ఎదుర్కొని ఈ మైలురాయిని తాకాడు.అయితే బ్రూక్ బాబర్ కంటే చాలా తక్కువ బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ పరంగా కూడా బాబర్‌కు బ్రూక్‌కు భారీ తేడాతో ఉంది. ఈ మైలురాయిని చేరుకునేందుకు బాబర్‌కు 62 ఇన్నింగ్స్‌లు అవసరమైతే.. బ్రూక్ కేవలం 44 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.
బ్రూక్ టెస్ట్ కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 26 ఏళ్ల బ్రూక్ కేవలం 44 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లోనే ఓ డబుల్ సెంచరీ, 8 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీల సాయంతో 60.21 సగటున 2529 పరుగులు చేశాడు. బ్రూక్ స్ట్రయిక్‌రేట్ 88కి పైగా ఉండటం విశేషం. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో బ్రూక్ ఈ ఘనత సాధించాడు.
మెరుపు శతకం
ఈ మ్యాచ్‌లో బ్రూక్ 127 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 91 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్‌లో జేమీ స్మిత్ మెరుపు సెంచరీ సాధించాడు. స్మిత్ కేవలం 80 బంతుల్లోనే శతక్కొట్టి టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ తరఫున నాలుగో వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. స్మిత్ 82 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
మూడో రోజు లంచ్ విరామం సమయానికి ఇంగ్లండ్ 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంగ్లండ్ ఇంకా 338 పరుగులు వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో క్రాలే (19), బెన్ డకెట్ (0), ఓలీ పోప్ (0) నిన్ననే ఔటయ్యారు.
బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్ ఆడుతున్న ఆకాశ్‌దీప్ వరుస బంతుల్లో తొలి టెస్ట్ సెంచరీ హీరోలు బెన్ డకెట్, ఓలీ పోప్‌లను డకౌట్ చేశాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ 13 పరుగులు మాత్రమే. 25 పరుగుల వద్ద ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ క్యాచ్ పట్టడంతో జాక్ క్రాలే (19) ఔటయ్యాడు.
నిప్పులు చెరిగిన సిరాజ్.. ఆదుకున్న బ్రూక్, స్మిత్
ఇవాళ ఆట ప్రారంభం కాగానే సిరాజ్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో రూట్ (22), స్టోక్స్ (0) వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను బ్రూక్, స్మిత్ జోడీ ఆదుకుంది. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయమైన 165 పరుగులు జోడించారు. ఓవర్‌నైట్ స్కోర్ 77/3 వద్ద ఇంగ్లండ్ ఇవాల్టి ఆటను ప్రారంభించింది.
ముందు రోజు (రెండో రోజు) టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీతో (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో 587 పరుగులకు ఆలౌటైంది.
భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.
మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.