హక్కుగా భావిస్తున్నారు.. వాళ్లపై వేటు వేయండి: గావస్కర్‌ ఫైర్‌ | Drop These Players: Gavaskar Slams Overseas Stars For Late IPL Arrivals | Sakshi
Sakshi News home page

హక్కుగా భావిస్తున్నారు.. వాళ్లపై వేటు వేయండి: గావస్కర్‌ ఫైర్‌

Mar 23 2026 10:55 AM | Updated on Mar 23 2026 11:21 AM

Drop These Players: Gavaskar Slams Overseas Stars For Late IPL Arrivals

కమిన్స్‌, గావస్కర్‌, హాజిల్‌వుడ్‌ (PC: BCCI)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఫ్రాంఛైజీలకు టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ కీలక సూచన చేశాడు. విదేశీ ఆటగాళ్ల విషయంలో ఫ్రాంఛైజీలు కాస్త కఠినంగా ఉండాలని సూచించాడు. చాలా మంది లీగ్‌ను తేలికగా తీసుకుంటున్నారని.. అలాంటి వారు దారిలోకి రావాలంటే కఠినంగా వ్యవహరించక తప్పదు అన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్‌గా కొనసాగుతున్న భారత జట్టు మాజీ కెప్టెన్‌ సునిల్‌ గావస్కర్‌.. ఐపీఎల్‌ కామెంట్రీ ప్యానెల్‌లో కీలక సభ్యుడు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే సన్నీ.. విదేశీ ఆటగాళ్లలో కొంతమంది వైఖరి తనకు నచ్చడం లేదని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్‌స్టార్‌కు రాసిన కాలమ్‌లో...

గాయాల బెడద లేకున్నా..
‘‘కొంతమంది విదేశీ ఆటగాళ్లు గాయాల బెడద లేకున్నా అందుబాటులో ఉండటం లేదు. కొంతమంది వ్యక్తిగత కారణాలు చూపుతున్నారు. మరి కొందరేమో ఆలస్యంగా శిక్షణా శిబిరంలో చేరుతున్నారు. ఫ్రాంఛైజీలు తమ కోసం ఏం చేయడానికైనా సిద్ధమనే ఆలోచనతోనే వారు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

మరోవైపు.. ఫ్రాంఛైజీ యజమానులు కూడా అందుకు తగ్గట్లుగా ఆటగాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా వారి కుటుంబాలకు అయ్యే ఖర్చులు సైతం భరిస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా వారంతా చక్కగా అన్ని చోట్లకు వెళ్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.

భారతీయ ఆతిథ్యం అలాగే ఉంటుంది
నిజానికి భారతీయ ఆతిథ్యం అలాగే ఉంటుంది. అతిథులకు అన్ని రకాలుగా మర్యాద చేస్తాము. కానీ కొంతమంది ఆటగాళ్లు ఇది తమ హక్కుగా భావిస్తున్నారు. తమకోసం ఏదైనా చేస్తారులే అన్న ధోరణి వారిలో కనిపిస్తోంది. మన మంచితనాన్ని వారు వేరొక రకంగా అర్థం చేసుకుంటున్నారు.

ఫ్రాంఛైజీ తమను కొనే సమయంలో తాము కచ్చితంగా అందుబాటులో ఉంటామని చెప్పే ఆటగాళ్లలో చాలా మంది.. సమయానికి చేతులెత్తేస్తున్నారు. తమ సమస్యల గురించి ముందుగానే ఫ్రాంఛైజీలకు చెప్పే ప్రయత్నం చేయడం లేదు. ఆఖర్లో ఏదో ఒక కారణం సాకుగా చూపి తప్పుకొంటున్నారు.

వాళ్లపై వేటు వేయండి
ఇలాంటి ఆటగాళ్లపై వేటు వేయడంలో ఫ్రాంఛైజీలు మరో ఆలోచనకు తావు ఇవ్వకూడదు. టైటిల్‌ గెలిచేందుకే ప్రతి జట్టు బరిలోకి దిగుతుంది. కానీ ఇలాంటి కొంతమంది వల్ల కూర్పు దెబ్బతిని అవకాశాలు సన్నగిల్లుతాయి. ఫ్రాంఛైజీ యజమానులు కఠిన చర్యలు తీసుకుంటారనే భయం లేనంత వరకు ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి’’ అని గావస్కర్‌ ఘాటు విమర్శలు చేశాడు.

హ్యారీ బ్రూక్‌ విషయంలో
కాగా గతంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఆఖరి నిమిషంలో లీగ్‌ నుంచి తప్పుకొన్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2025 మెగా వేలానికి ముందు ఐపీఎల్‌ పాలక మండలి కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. గాయాలు, అత్యవసర పరిస్థితుల్లో మినహా లీగ్‌ నుంచి అకస్మాత్తుగా తప్పుకొనే ఆటగాళ్లు మరోసారి వేలంలో పాల్గొనకుండా రెండేళ్లపాటు నిషేధం విధించింది.

ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ విషయంలో ఈ నిబంధన అమలైంది కూడా! 2025 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ అతడిని కొనుగోలు చేయగా ఆఖరి నిమిషంలో తప్పుకొన్నాడు. అతడు ఇలా చేయడం వరుసగా ఇది రెండోసారి. దీంతో రెండేళ్ల పాటు బ్రూక్‌ ఐపీఎల్‌ ఆడకుండా నిషేధం విధించారు. 

ఇదిలా ఉంటే.. మార్చి 28న ఐపీఎల్‌-2026కు తెరలేవనుంది. ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, ఆర్సీబీ ఆటగాడు జోష్‌ హాజిల్‌వుడ్‌, ఢిల్లీ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా ఆలస్యంగా జట్లతో చేరనున్నారు. ఈ ముగ్గురు పేసర్లు ఆస్ట్రేలియాకు చెందినవారేనన్న సంగతి తెలిసిందే. 

చదవండి: IPL 2026: పంత్‌ను తీసేద్దామనుకున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement