'డ్రీమ్‌' ధనాధన్

Dream 11 Will Be The Title Sponsor For The IPL 2020 - Sakshi

ఐపీఎల్‌–2020 టైటిల్‌ స్పాన్సర్‌గా డ్రీమ్‌ ఎలెవన్‌ 

రూ. 222 కోట్లకు హక్కులు దక్కించుకున్న ఫాంటసీ స్పోర్ట్స్‌ కంపెనీ

కరోనా కష్టకాలంలో కూడా భారత క్రికెట్‌ గల్లా పెట్టెలో కాసులకు కొదవ లేకపోయింది. వినోదానికి చిరునామాగా మారిన ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ ద్వారా ఒక్క సీజన్‌కే రూ. 222 కోట్లు బీసీసీఐకి లభించనున్నాయి. ఇప్పటికే తప్పుకున్న ‘వివో’తో పోలిస్తే ఇది తక్కువగా కనిపిస్తున్నా... ఇతర మార్గాల ద్వారా తాము ఆశించిన మొత్తాన్ని దాదాపుగా అందుకునేందుకు బీసీసీఐ ప్రణాళిక రూపొందించింది.

ముంబై: ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ ఫామ్‌ ‘డ్రీమ్‌ 11’ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) –2020 టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ హక్కులు సొంతం చేసుకుంది. ఈ ఏడాది కోసం డ్రీమ్‌ రూ. 222 కోట్లు చెల్లించనుంది. స్పాన్సర్‌షిప్‌ కోసం వేసిన బిడ్లను మంగళవారం తెరవగా...అందరికంటే ఎక్కువగా బిడ్‌ వేసిన డ్రీమ్‌ 11కు ఈ అవకాశం దక్కింది. రెండో స్థానంలో బైజూస్‌ (రూ. 201 కోట్లు), అన్‌ అకాడమీ (రూ. 170 కోట్లు) నిలిచాయి. వచ్చే ఏడాది స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ‘వివో’ తిరిగి రాకపోతే తర్వాత రెండేళ్లు కూడా డ్రీమ్‌ ఎలెవన్‌కు స్పాన్సర్‌షిప్‌ హక్కులు ఇవ్వనుంది.

ఇందు కోసం రూ. 240 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ‘వివో’ ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించింది. దాంతో పోలిస్తే ఇది సగమే (49.5 శాతం తక్కువ). అయితే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇది ఏ రకంగా చూసినా బోర్డుకు లాభదాయకమే. పైగా ఈ సారి అసోసియేట్‌ స్పాన్సర్ల సంఖ్యను మూడునుంచి ఐదుకు పెంచిన బోర్డు...చెరో రూ. 40 కోట్ల చొప్పున అదనంగా మరో రూ. 80 కోట్లను తమ ఖాతాలో వేసుకోనుంది. అంటే ఐపీఎల్‌–13 సీజన్‌నుంచి బోర్డుకు స్పాన్సర్ల ద్వారానే రూ. 302 కోట్లు రానున్నాయి. 

ఇక్కడా ‘చైనా’ ఉంది! 
భారత్‌–చైనా మధ్య సరిహద్దు వివాదం కారణంగానే ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌నుంచి చైనా కంపెనీ ‘వివో’ అర్ధాంతరంగా తప్పుకుంది. ఇప్పుడు వచ్చి న డ్రీమ్‌11లో కూడా చైనా సంస్థ ‘టెన్సెంట్‌’ పెట్టుబడులు ఉన్నాయి. అయితే దీనిని బీసీసీఐ సమర్థించుకుంది. ‘ఇది ముమ్మాటికీ భారత కంపెనీనే. దీనిని ప్రారంభించినవారితో పాటు అందులో పని చేస్తున్న ఉద్యోగులు భారతీయులే. టెన్సెంట్‌ వాటా 10 శాతంకంటే కూడా తక్కువ. కాబట్టి దానిని పట్టించుకోనవసరం లేదు’ అని ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ స్పష్టం చేశారు.

‘డ్రీమ్‌ 11’ ఆటలతో జత కట్టడం ఇది మొదటిసారి కాదు. ఐసీసీ అధికారిక ఫాంటసీ క్రికెట్‌ ప్లాట్‌ఫామ్‌గా ఉండటంతో పాటు కరీబియన్‌ లీగ్, బిగ్‌ బాష్, సూపర్‌ లీగ్‌ తదితర పోటీలకు స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఐపీఎల్‌తో కూడా అసోసియేట్‌ స్పాన్సర్‌గా ఉంటూ ఇప్పుడు టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. అయితే ప్రపంచంలో అత్యుత్తమ క్రీడా వినోదంగా గుర్తింపు తెచ్చుకున్న ఐపీఎల్‌కు ఒక ఫాంటసీ లీగ్‌ స్పాన్సర్‌గా వ్యవహరించడమే ఆశ్చర్యం కాగా... దాని మాటున భారీ బెట్టింగ్‌కు ఇది అవకాశం కల్పిస్తోంది. ఎందుకంటే కొన్నాళ్ల క్రితం శ్రీలంకలో మ్యాచ్‌ జరుగుతుందంటూ పంజాబ్‌లో మ్యాచ్‌లు నిర్వహించి ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు జరిపిన వివాదంలో డ్రీమ్‌ 11 పేరు కూడా ఉంది. దీనిపై ప్రస్తుతం బీసీసీఐ అవినీతి వ్యతిరేక విభాగం విచారణ కూడా జరుగుతోంది. ఇలాంటి స్థితిలో బోర్డు దానికి స్పాన్సర్‌షిప్‌ అప్పజెప్పడం విషాదం. 2013 ఐపీఎల్‌ సమయంలో వచ్చిన బెట్టింగ్‌ వివాదాన్ని బీసీసీఐ మరచిపోయినట్లుంది!

‘కలల’ ఆటలు...
డ్రీమ్‌ 11, మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్, మై 11 సర్కిల్, బల్లేబాజీ, మై టీమ్‌ 11, స్కిల్‌ ఫర్‌ ట్యూన్‌... పేరు ఏదైతేనేం... అన్నీ ఊరించి ఊబిలోకి దింపే తరహా ఫాంటసీ స్పోర్ట్స్‌ లీగ్‌లే! భారత్‌లో ఒక్కసారిగా దూసుకొచ్చిన ఈ కలల క్రీడలకు ధోని, కోహ్లి, రోహిత్, యువరాజ్‌ అందరూ బ్రాండ్‌ అంబాసిడర్లే. వీటిలో ఒకదానికి ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ కూడా ప్రచారకర్త. మొబైల్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయడం మొదలు ఇది వ్యసనంగా మారే వరకు అన్ని కంపెనీలది దాదాపు ఒకే శైలి. సరిగ్గా చెప్పాలంటే ‘భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా’కు ఇది ఆధునిక మొబైల్‌ వెర్షన్‌ మాత్రమే!  ముందుగా అవి ఉచితంగా ఆడే అవకాశం కల్పిస్తాయి. ఆ తర్వాత కొంత డబ్బు చెల్లించి సభ్యులుగా మారితే ఎక్కువగా ఆడే అవకాశం ఉందంటూ ఆఫర్లు... ఆపై ప్రతీ ఆట (మ్యాచ్‌)కు కనీస మొత్తం చెల్లించిన తర్వాతే అందులో భాగమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. క్రికెట్‌ లేదా మరే క్రీడపైనైనా తనకు ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతోనే డబ్బులు సంపాదించుకోవచ్చనే ఆశతో ఎంతో మంది దీనికి అలవాటు పడిపోతున్నారు. తమను తాము సదరు క్రీడలో పెద్ద అనుభవజ్ఞులైన విశ్లేషకులుగా భావించి వేసుకుంటున్న అంచనాలతో లెక్క తప్పడం, ఆపై పెద్ద మొత్తంలో నష్టపోవడం తరచుగా జరిగిపోతున్నాయి.

కానీ లీగ్‌ నిర్వాహకులకు మాత్రం సర్వీస్‌ ఫీజు పేరుతో కాసుల పంట పండుతోంది. లీగ్‌లో ఎవరూ గెలిచినా, ఓడినా వారి ఆదాయం అమాంతం పెరిగిపోతోంది. ఈ ఫాంటసీ లీగ్‌ల వ్యవహారమంతా పక్కా జూదం అంటూ ఇందులో భారీగా నష్టపోయినవారు గతంలో కోర్టుకెక్కారు. అయితే ‘ఇందులో ఆడాలంటే తెలివితేటలు, ఆటలపై పరిజ్ఞానం కూడా అవసరం. కాబట్టి పూర్తిగా జూదంగా పరిగణించలేం’ అంటూ కోర్టు డ్రీమ్‌ 11కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే చట్టంలోని కొన్ని లోపాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఈ సంస్థలు తమ వ్యవహారాలు నడిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు చెప్పినా... తెలంగాణ రాష్ట్రంలో ఫాంటసీ లీగ్‌కు అనుమతి లేదు. తెలంగాణతో పాటు ఒడిషా, అసోంలలో ఈ లీగ్‌లు ఆడటం చట్టవిరుద్ధం. ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి డ్రీమ్‌ 11 విలువ 2.25 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 17 వేల కోట్లు) కావచ్చని వ్యాపార వర్గాల అంచనా. దీన్ని బట్టి చూస్తే  మిగిలిన రాష్ట్రాల్లో ఇది ఎంతగా విస్తరించిందో అర్థమవుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top