ధోని, యువరాజ్‌లకు అరుదైన గౌరవం

Dhoni, Mithali Raj, Yuvraj Singh Among MCC Honour List - Sakshi

భారత క్రికెట్‌ దిగ్గజాలు మహేంద్రసింగ్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనాలతో పాటు భారత మహిళా క్రికెట్‌ దిగ్గజాలు మిథాలీ రాజ్‌, ఝులన్‌ గోస్వామిలకు అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ) వీరికి లైఫ్‌ టైమ్‌ మెంబర్‌షిప్‌ ఇచ్చి సత్కరించింది. వీరితో పాటు మరో 14 మంది పురుష, మహిళా క్రికెట్‌ దిగ్గజాలకు కూడా ఎంసీసీ జీవితకాల సభ్యత్వాన్ని అందించి గౌరవించుకుంది.

భారత క్రికెట్‌ దిగ్గజాలతో పాటు వెస్టిండీస్‌కు చెందిన మెరిస్సా అగ్యూలైరా, ఇంగ్లండ్‌కు చెందిన జెన్నీ గన్‌, లారా మార్ష్‌, ఇయాన్‌ మోర్గాన్‌, కెవిన్‌ పీటర్సన్‌, అన్యా శ్రుబ్‌సోల్‌, పాకిస్తాన్‌కు చెందిన మహ్మద్‌ హఫీజ్‌, ఆస్ట్రేలియాకు చెందిన రేచల్‌ హేన్స్‌, బంగ్లాదేశ్‌కు చెందిన ముష్రఫే మోర్తాజా, న్యూజిలాండ్‌కు చెందిన రాస్‌ టేలర్‌, ఆమీ సాటరెత్‌వైట్‌, సౌతాఫ్రికాకు చెందిన డేల్‌ స్టెయిన్‌లను ఎంసీసీ లైఫ్‌ టైమ్‌ మెంబర్‌షిప్‌ ఇచ్చి గౌరవించింది. ఈ వివరాలను ఎంసీసీ సీఈఓ, సెక్రెటరీ గుయ్‌ లావెండర్‌ ఇవాళ (ఏప్రిల్‌ 5) అధికారికంగా ప్రకటించారు. 

కాగా, ఎంసీసీ లైఫ్ టైమ్‌ మెంబర్‌షిప్‌ అందుకున్న ధోని, యువరాజ్‌, రైనా భారత్‌ 2011 వన్డే వరల్డ్‌కప్‌ సాధించిన జట్టులో సభ్యులు కాగా.. మిథాలీ రాజ్‌ మహిళా క్రికెట్‌లో అత్యధిక పరుగులు (7805) సాధించిన బ్యాటర్‌గా, ఝులన్‌ గోస్వామి వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా బౌలర్‌ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ఎంసీసీ చివరిసారిగా లైఫ్‌ టైమ్‌ మెంబర్‌షిప్‌లను 2021 అక్టోబర్‌లో ప్రకటించింది. నాడు ఇంగ్ల​ండ్‌కు చెందిన అలిస్టర్‌ కుక్‌, సౌతాఫ్రికాకు చెందిన జాక్‌ కల్లిస్‌, భారత్‌కు చెందిన హర్భజన్‌ సింగ్‌లతో పాటు మరో 15 మందికి ఈ గౌరవం దక్కింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top