రెండు రాష్ట్రాల టాపర్‌గా ఎంఎస్‌ ధోని | Dhoni Becomes The Highest Taxpayer Across Jharkhand and Bihar | Sakshi
Sakshi News home page

రెండు రాష్ట్రాల టాపర్‌గా ఎంఎస్‌ ధోని

May 8 2026 2:21 PM | Updated on May 8 2026 2:25 PM

Dhoni Becomes The Highest Taxpayer Across Jharkhand and Bihar

టీమిండియా దిగ్గజ ఆటగాడు, ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అయిన ఎంఎస్‌ ధోని, ఓ ఆర్దికపరమైన అంశానికి సంబంధించి రెండు రాష్ట్రాల టాపర్‌గా నిలిచాడు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అత్యధిక వ్యక్తిగత ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా రికార్డు నెలకొల్పాడు.

ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, బిహార్-ఝార్ఖండ్ కలిపి గత ఆర్థిక సంవత్సరంలో సుమారు ₹20,000 కోట్ల ఆదాయపు పన్ను వసూలు చేశాయి. ఇందులో ₹12,000 కోట్లు ఒక్క ఝార్ఖండ్ రాష్ట్రం నుంచే వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుగా ధోని నిలిచాడు. ఈ విషయాన్ని బిహార్-ఝార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ డా. డి. సుధాకర రావు మీడియాకు వెల్లడించారు.

ధోని ఎంత పన్ను చెల్లించాడన్న వివరాలను అధికారికంగా వెల్లడించకపోయినా, అతని ఆస్తులు, పెట్టుబడులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ఆధారంగా సుమారు ₹38 కోట్ల పన్ను చెల్లించినట్లు అంచనా వేస్తున్నారు.

ధోని నికర సంపద మరియు ఆదాయాలు:  
2026 మే నాటికి ధోని నికర సంపద సుమారు ₹1,060 కోట్లుగా అంచనా వేయబడింది. సంవత్సరానికి సుమారు ₹75 కోట్లు వివిధ వనరుల ద్వారా సంపాదిస్తున్నాడు. టెక్నాలజీ, ఫిన్‌టెక్ రంగాల్లో కార్స్‌24, గరుడ ఏరోస్పేస్‌, ఖటాబుక్‌ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసడర్‌గా, ఇన్వెస్టర్‌గా ఉన్నాడు.

ఫుడ్ & బెవరేజెస్ రంగంలో సెవెన్‌ ఇంక్‌ బ్రివ్స్‌, హౌస్‌ ఆఫ్‌ బిర్యాని, షాకా హ్యారీ (ప్లాంట్ బేస్డ్ మీట్) వంటి బ్రాండ్లతో ముడిపడి ఉన్నాడు. క్రీడా యాజమాన్యంలో చెన్నైయిన్ ఎఫ్‌సి (ISL ఫుట్‌బాల్), మహి రేసింగ్ టీమ్ ఇండియా (సూపర్‌స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్‌షిప్)కు కో-ఓనర్‌గా ఉన్నాడు.

ధోని పేరిట రాంచీలో 7 ఎకరాల్లో ఓ లగ్జరీ ఇళ్లు ఉంది. 100కి పైగా వింటేజ్, మోడరన్ బైకులు ఉన్నాయి. వీటన్నటి కోసం ఓ గాజు గోడల గ్యారేజీ ఉంది. అలాగే 43 ఎకరాల ఫామ్‌ను నిర్వహిస్తూ వాణిజ్యపరంగా కూరగాయలు సాగు చేస్తున్నాడు.

భారతీయ క్రికెటర్లలో ఎవరు ఎంత పన్ను చెల్లిస్తున్నారు..?
(2023-24 ఆర్థిక సంవత్సరం ఆధారంగా)

- విరాట్ కోహ్లీ : ₹66 కోట్లు  
- ఎంఎస్ ధోని : ₹38 కోట్లు  
- సచిన్ టెండూల్కర్ : ₹28 కోట్లు  
- సౌరవ్ గాంగూలీ : ₹23 కోట్లు  
- హార్దిక్ పాండ్యా : ₹13 కోట్లు  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement