ఐపీఎల్‌ 2020: టైటిల్‌ ఎవరిదో?

Delhi Won The Toss Elected Bat First In The Final - Sakshi

దుబాయ్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌ టైటిల్‌ కోసం ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగు టైటిల్స్‌ గెలిచిన ముంబై ఒకవైపు.. తొలి టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీ మరొకవైపు ఫైనల్‌లో తలపడునున్నాయి. ఈ తుది సమరంలో టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ చేయడానికే మొగ్గుచూపాడు. కాగా, ఇప్పటికే లీగ్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తూ అత్యంత విజయవంతమైన టీమ్‌గా నిలిచిన రోహిత్‌ శర్మ బృందం ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తుంది. ‘డేర్‌డెవిల్స్‌’గా విఫలమైన ఢిల్లీ... ‘క్యాపిటల్స్‌’గా మారి గత ఏడాది మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు మరింత మెరుగైన ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌కు చేరింది.(ఫస్ట్‌ సెంచరీ చేయనివ్వలేదని..)

ఈ సీజన్‌ లీగ్‌ దశలో ముంబై ఇండియన్స్‌ 14 మ్యాచ్‌లలో 9 గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో అతి సునాయాసంగా ఢిల్లీని 57 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన చివరి మ్యాచ్‌ ను మినహాయిస్తే తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు అత్యల్ప స్కోరు కూడా 162 పరుగులు ఉందంటే జట్టు బ్యాటింగ్‌ బలమేమిటో అర్థమవుతోంది. ముంబై జట్టులో ఇషాన్‌ కిషన్‌ (483 పరుగులు), డికాక్‌ (483), సూర్యకుమార్‌ యాదవ్‌ (461)ల బ్యాటింగ్‌ ప్రధానంగా జట్టును నడిపించింది. ఇక పొలార్డ్‌ (190.44), హార్దిక్‌ పాండ్యా (182.89)ల స్ట్రయిక్‌రేట్‌తో ముంబై ఇండియన్స్‌ విజయాల్లో తమదైన హార్డ్‌ హిట్టింగ్‌ పాత్రను పోషించారు.. ఇక బౌలింగ్‌లో బుమ్రా (27 వికెట్లు), బౌల్ట్‌ (22) ప్రదర్శన ముంబైని ముందంజలో నిలిపింది. ఇక​ ఢిల్లీ క్యాపిటల్స్‌ లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లలో 8 గెలిచి రెండో స్థానంలో నిలిచింది. తొలి క్వాలిఫయర్‌లో చిత్తుగా ఓడినా... రెండో క్వాలిఫయర్‌లో సమష్టి ప్రదర్శనతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచి ఫైనల్‌ చేరింది. లీగ్‌ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఢిల్లీ.. ఆపై నాలుగు వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు ఒక విజయంలో ప్లే ఆఫ్స్‌ చేరగా... ముంబై చేతిలో భారీ ఓటమి జట్టు బలహీనతను చూపించింది. 

ఢిల్లీ జట్టులో ధావన్‌ 603 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఇంతా వరకూ బాగానే ఉన్నా నాలుగు డకౌట్లు కూడా ధావన్‌ బ్యాటింగ్‌పై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ధావన్‌ నుంచి మరోసారి అదిరే ఆరంభం వస్తే ఢిల్లీకి ఆందోళన తగ్గుతుంది. శ్రేయస్‌ అయ్యర్‌ 454 పరుగులతో రెండో స్థానంలో ఉన్నా... అతని స్ట్రయిక్‌రేట్‌ (122.37) పేలవంగా ఉండటం కలవర పరుస్తోంది. ఆ జట్టుకు బ్యాటింగ్‌లో మరో ప్రధాన బలం మార్కస్‌ స్టోయినిస్‌. స్టోయినిస్‌ 352 పరుగులు సాధించి ఢిల్లీ విజయాలక్లో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో కూడా మెరిసి 12 వికెట్లు సాధించాడు. ఢిల్లీ బౌలింగ్‌ విభాగంలో రబడా 29 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. అతనికి నోర్జే నుంచి కూడా చక్కటి సహకారం లభిస్తోంది. నోర్జే 20 వికెట్లు సాధించాడు. వీరికి జతగా అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు కూడా రాణిస్తే పోరు ఆసక్తికరంగా మారుతోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top