ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 18 సీజన్‌లు ముగిసినప్పటికీ టైటిల్ గెలవాలన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆకలి మాత్రం తీరడం లేదు. జట్టు పేరు మార్చినా, ఆటగాళ్లను మార్చినా, దిగ్గజ ఆటగాళ్లు జట్టును నడిపించినా ఢిల్లీ తలరాత మాత్రం మారలేదు. ఐపీఎల్ ప్రారంభమైన 2008లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఎంట్రీ ఇచ్చి తొలి ప్రయత్నంలో సెమీఫైనల్ చేరింది. తర్వాతి సీజన్‌లో కూడా సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఇక మధ్యలో 2012లో మరోసారి ప్లేఆఫ్స్ చేరినప్పటికీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది. ఆ తర్వాత వరుసగా ఆరు సీజన్ల పాటు లీగ్ దశకే పరిమితమైంది. అయితే 2018లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను జేఎస్‌డబ్ల్యూ సంస్థ కొనుగోలు చేసింది. ఆ తర్వాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చారు. పేరు మార్చిన తర్వాత వరుసగా మూడు సీజన్లు (2019, 2020, 2021) అదరగొట్టింది.
పుష్కర కాలానికి..
ఐపీఎల్ ప్రారంభమైన పుష్కరకాలం తర్వాత 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌కే పరిమితమైంది. 2021లో మరోసారి ప్లేఆఫ్స్ చేరిన ఢిల్లీ కథ 2022 నుంచి మళ్లీ మొదటికే వచ్చింది. గత సీజన్‌లోనూ ఢిల్లీ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.
బ్యాటింగే బలం..
ఐపీఎల్ 2026 సీజన్ కోసం సిద్ధమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పేపర్‌పైన బలంగానే కనిపిస్తుంది. పేపర్‌పై ఉన్న బలాన్ని మైదానంలోనూ ప్రదర్శిస్తుందా లేక గత సీజన్‌ల మాదిరే చతికిలపడుతుందా అన్నది చూడాలి. జట్టుకు కేఎల్ రాహుల్ పెద్ద బలం అని చెప్పొచ్చు.
గత సీజన్‌లో కేఎల్ రాహుల్ 539 పరుగులతో జట్టు టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. మరోసారి రాహులే జట్టుకు కీలకమవ్వనున్నాడు. కేఎల్ రాహుల్‌తో పాటు బెన్ డకెట్, పాతుమ్ నిసాంక, పృథ్వీ షా, అభిషేక్ పొరేల్, నితీశ్ రాణా, డేవిడ్ మిల్లర్, సమీర్ రజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ వంటి హిట్టర్లు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం.ఇక కెప్టెన్ అక్షర్ పటేల్ బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించగల సమర్థుడు.
మిచెల్ స్టార్క్‌ఆడేనా?
బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్ కూడా పటిష్టంగా ఉన్నప్పటికీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడతాడా లేదా అన్న సంశయం ఉండడంతో కాస్త ఆందోళన నెలకొంది. నటరాజన్, ముకేశ్ కుమార్‌కు తోడు దేశవాళీల్లో సంచలన ప్రదర్శనతో వేలంలో రూ. 8.4 కోట్ల ధరతో ఢిల్లీ దక్కించుకున్న కశ్మీర్ పేసర్ అకిబ్ నబీపై కూడా జట్టు భారీ అంచనాలే పెట్టుకుంది.
స్పిన్ విభాగంలో అక్షర్, కుల్‌దీప్, విప్రజ్ నిగమ్‌లతో బలంగానే కనిపిస్తోంది. మొత్తం మీద ‘అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని’ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి తయారైంది. ఐపీఎల్ 19వ సీజన్‌లోనైనా మెరిసి కప్పు కొట్టాలనే లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగుతోంది. ఢిల్లీ కల నెరవేరాలని ఆశిద్దాం.
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు అంచనా: అక్షర్‌పటేల్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిసాంక, నితీశ్ రానా, డేవిడ్ మిల్లర్, సమీర్ రిజ్వీ/కరుణ్ నాయర్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోశ్ శర్మ, కుల్దీప్‌యాదవ్, అకిబ్ నబీ, స్టార్క్, ముకేశ్ కుమార్/నటరాజన్.
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బెస్ట్: 2020 (రన్నరప్); 2019, 2021 (ప్లే ఆఫ్స్); 2008, 2009 (సెమీఫైనల్స్)


