కేన్‌ విలియమ్సన్‌ అందుకే ఆడలేదా..

David Warner Gives Clarity Why Kane Williamson Not Played In RCB Match - Sakshi

దుబాయ్‌ : 2018, 2019లో డేవిడ్‌ వార్నర్‌ స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా పనిచేసిన కేన్‌ విలియమ్సన్‌ ఆ రెండు సీజన్లలో తన ఆటతో పాటు కెప్టెన్సీలోనూ ఆకట్టుకున్నాడు. విలియమ్‌సన్ ‌ 2018లో సన్‌రైజర్స్‌ జట్టును ఫైనల్‌ వరకు తీసుకొచ్చినా చెన్నైతో జరిగిన ఫైనల్లో ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కాగా విలిమయ్‌సన్‌ 2018లో మొత్తం 17 మ్యాచ్‌ల్లో 735 పరుగులు చేసి లీగ్‌ టాప్‌ స్కోరర్‌గా ఆరెంజ్‌ క్యాప్ అందుకున్నాడు. కాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌కు వచ్చేసరికి సన్‌రైజర్స్‌ యాజమాన్యం డేవిడ్‌ వార్నర్‌పై మరోసారి నమ్మకం ఉంచి అతన్ని తిరిగి కెప్టెన్‌గా నియమించింది.

కేన్‌ విలియమ్సన్‌ ఆటగాడిగా మంచి రికార్డు ఉండడంతో జట్టులో తుది స్థానం తప్పకుండా ఉంటుందని అందరూ భావించారు. అయితే నిన్న(సోమవారం) ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో విలియమ్సన్‌ ఆడకపోవడంపై పలు సందేహాలు రేకెత్తాయి. జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లే ఆడాలనే నిబంధన ఉండడం దీనికి కారణమై ఉంటుందని అంతా అనుకున్నారు.  అయితే ఆర్‌సీబీతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ విలియమ్సన్‌‌ ఆడకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. (చదవండి : 'ఆర్చర్‌ రెడీగా ఉండు .. తేల్చుకుందాం')

'మ్యాచ్‌కు ముందురోజు మహ్మద్‌ నబీతో కలిసి ప్రాక్టీస్‌ చేస్తుండగా కేన్‌ విలియమ్సన్‌‌కు కండరాలు పట్టేశాయి. దాంతో చివరి నిమిషంలో ఆర్‌సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌కు అతను‌ దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో అతని స్థానంలో బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా మిచెల్‌ మార్ష్‌కు అవకాశం లభించింది. అయితే అనూహ్యంగా మార్ష్‌ కూడా గాయపడడం మాకు కష్టంగా మారింది. మార్ష్‌ తన నొప్పిని భరిస్తూనే మ్యాచ్‌ గెలిపించాలనే ఉద్దేశంతో 10వ నెంబర్‌ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎక్స్‌రే రిపోర్ట్‌లో మార్ష్‌ గాయం మరీ పెద్దది కాదని తేలింది. కానీ కుడికాలు చీలమండ గాయంతో అతని పాదాన్ని సరిగా నిలుపలేకపోతున్నాడు .. దీంతో టోర్నికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే మేం ఒత్తిడికి తలొగ్గకుండా ధైర్యంగా ముందుకు సాగుతాం అంటూ తెలిపాడు. కాగా కేన్‌ విలియమ్సన్‌ సెప్టెంబర్‌ 26న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.(చదవండి : 'చహల్‌ కీలకమని ముందే అనుకున్నాం')

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top