
Pro Kabaddi League 2022 Finals: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో దబంగ్ ఢిల్లీ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. శుక్రవారం హోరాహోరీగా జరిగిన ఎనిమిదో సీజన్ ఫైనల్లో దబంగ్ ఢిల్లీ 37–36తో గతంలో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన పట్నా పైరేట్స్‌పై విజయం సాధించింది. విజేతగా నిలిచిన ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ పట్నా జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్‌మనీగా లభించాయి. ఫైనల్లో ఢిల్లీ తరఫున రెయిడర్లు నవీన్ కుమార్, విజయ్ మలిక్ అద్భుత ప్రదర్శన చేశారు.
విజయ్ 14 పాయింట్లు, నవీన్ 13 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా తరఫున సచిన్ 10 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. పీకేఎల్ ఎనిమిదో సీజన్‌లో నవీన్ (ఢిల్లీ; రూ. 20 లక్షలు) ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్’గా... మోహిత్ గోయట్ (పుణేరి పల్టన్; రూ. 8 లక్షలు) ‘ఎమర్జింగ్ ప్లేయర్’గా... మొహమ్మద్ రెజా (పట్నా; రూ. 15 లక్షలు) ‘బెస్ట్ డిఫెండర్’గా... పవన్ సెహ్రావత్ (బెంగళూరు బుల్స్; రూ. 15 లక్షలు) ‘బెస్ట్ రెయిడర్’గా అవార్డులను సొంతం చేసుకున్నారు.