Commonwealth Games 2022: మురళీ శ్రీశంకర్‌ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం

CWG 2022: Murali Sreeshankar Won Silver Long Jump Script History India - Sakshi

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో భారత్‌ పతకాల జోరు కొనసాగుతుంది. బుధవారం హై జంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సాధించిన ఆ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల లాంగ్‌ జంప్‌ ఫైనల్లో భారత్‌ అథ్లెట్‌ మురళీ శ్రీశంకర్‌ రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల లాంగ్‌ జంప్‌ విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఓవరాల్‌గా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో లాంగ్‌జంప్‌ విభాగంలో ఇది మూడో పతకం. ఇంతకముందు 2002 ,2010లో మహిళల లాంగ్‌ జంప్‌ విభాగంలో అంజూ బాబీ జార్జీ(కాంస్యం), ప్రజూషా మాలిక్కల్‌(రజతం) పతకాలు సాధించారు.

భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి జరిగిన లాంగ్‌ జంప్‌ ఫైనల్లో  ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకిన శ్రీశంకర్‌ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. కాగా బహమాస్‌కు చెందిన లకాన్‌ నైర్న్‌ కూడా 8.08 మీటర్లే దూకి స్వర్ణం గెలిచాడు. ఎందుకంటే లకాన్‌ రెండో ఉత్తమ ప్రదర్శన(7.98 మీటర్లు).. శ్రీశంకర్‌(7.84 మీటర్లు) కన్నా ఎక్కువగా ఉండడమే కారణం. జమైకాకు చెందిన థాంప్సన్‌(8.05 మీటర్లు) దూకి కాంస్యం గెలిచాడు.

కాగా కేరళకు చెందిన 23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్‌ 2018 కామన్‌వెల్త్‌ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు. అపెండిస్‌ సమస్యతో కామన్‌వెల్త్‌కు దూరమైన మురళీ శ్రీ శంకర్‌ ఇకపై లాంగ్‌ జంప్‌ చేయకపోవచ్చు అని అంతా భావించారు. కానీ అపెండిస్‌ ఆపరేషన్‌ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా లాంగ్‌జంప్‌లో తనను తాను మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్‌ ఔరా అనిపించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top