శ్రీలంకకు మరో భారీ షాక్‌! ఘోర పరాభవంతో నిష్క్రమణ.. అదొక్కటేనా? | Sakshi
Sakshi News home page

CWC 2023: శ్రీలంకకు మరో భారీ షాక్‌! ఘోర పరాభవంతో నిష్క్రమణ.. అదొక్కటేనా?

Published Fri, Nov 10 2023 1:39 PM

CWC 2023 Sri Lanka Crushing Loss To New Zealand Champions Trophy May Gone - Sakshi

ICC WC 2023- NZ vs SL: వన్డే వరల్డ్‌కప్‌-2023లో మాజీ చాంపియన్‌ శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి నేపథ్యంలో తాజా ప్రపంచకప్‌ ఎడిషన్‌లో ఏడో పరాజయాన్ని చవిచూసింది. దీంతో చాంపియన్స్‌ ట్రోఫీ-2025 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. 

కాగా భారత్‌ వేదికగా జరుగుతున్న ఈ ఐసీసీ టోర్నీకి నేరుగా అర్హత సాధించలేకపోయిన శ్రీలంక తొలుత క్వాలిఫయర్స్‌ ఆడింది. జింబాబ్వేలో జరిగిన ఈ ఈవెంట్లో గెలిచి.. నెదర్లాండ్స్‌తో కలిసి టాప్‌-10లో చేరి ప్రపంచకప్‌-2023లో అడుగుపెట్టింది.

ఈ క్రమంలో ఆరంభ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 102 పరుగులతో చిత్తుగా ఓడిన శ్రీలంకను తదుపరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌​ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైన లంక  తర్వాత ఇంగ్లండ్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఎట్టకేలకు తొలి విజయం అందుకుంది.

మళ్లీ పాత కథే
తర్వాత నెద్లాండ్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. అయితే, అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా మళ్లీ పాత కథనే పునరావృతం చేసింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో చిత్తై భంగపడింది.  

ఇక ఈ టోర్నీలో అన్నింటికంటే శ్రీలంకకు అతిపెద్ద ఓటమి ఎదురైంది మాత్రం టీమిండియా చేతిలోనే! ఆసియా కప్‌-2023 ఫైనల్లో కొలంబోలో లంకను చిత్తుగా ఓడించిన రోహిత్‌ సేన.. ప్రపంచకప్‌లో ముంబై వేదికగా మరోసారి మట్టికరిపించింది. ఏకంగా 302 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించి ఆధిపత్యం చాటుకుంది.

ఆ తర్వాత బంగ్లాదేశ్‌ చేతిలో 3 వికెట్ల తేడాతో ఓటమి.. ఈ దెబ్బకు సెమీస్‌ అన్న మాటను పూర్తిగా మరిచిపోయిన లంకన్‌ టీమ్‌.. కనీసం చాంపియన్స్‌ ట్రోఫీ-2025కైనా అర్హత సాధించాలని భావించింది. లీగ్‌ దశలో తమకు మిగిలిన మ్యాచ్‌లో గెలుపొందాలని బెంగళూరులో బరిలోకి దిగింది.

అయితే, న్యూజిలాండ్‌ బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ కకావికలం కావడం.. 172 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్‌ 23.2 ఓవర్లలోనే ఛేదించడంతో మరోసారి ఓటమే ఎదురైంది. 

ఆ మ్యాచ్‌ ఫలితం తేలిన తర్వాతే
దీంతో పాయింట్ల పట్టికలో ప్రస్తుతం తొమ్మిదోస్థానంలో నిలిచింది శ్రీలంక. తద్వారా చాంపియన్స్‌ ట్రోఫీ ఆడే జట్ల జాబితా నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఆస్ట్రేలియా- బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌- పాకిస్తాన్‌, ఇండియా- నెదర్లాండ్స్‌ మ్యాచ్‌ల ఫలితం తర్వాత శ్రీలంక భవితవ్యం పూర్తిగా తేలనుంది. రన్‌రేటు పరంగానూ వెనుకబడి ఉన్న కారణంగా ఈ మ్యాచ్‌ల ఫలితాలు ఎలా ఉన్నా శ్రీలంక ఆశలు వదులుకోవాల్సిందే!

వన్డే వరల్డ్‌కప్‌లో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన శ్రీలంకను గాయాల సమస్య వేధించింది. కెప్టెన్‌ దసున్‌ షనక సహా స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది. 

మాజీ చాంపియన్‌కు అవమానకరరీతిలో
ఇలాంటి తరుణంలో పగ్గాలు చేపట్టిన కుశాల్‌ మెండిస్‌ నాయకుడిగా సఫలం కాలేకపోయాడు. వరుస ఓటములతో డీలా పడ్డ జట్టును పరాజయాల ఊబి నుంచి ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కాక చేతులెత్తేశాడు. కాగా వరల్డ్‌కప్‌-1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించిన శ్రీలంక ట్రోఫీ గెలిచింది.  అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్‌ చేరి సత్తా చాటింది. కానీ ఈసారి ఇలా.. అవమానకరరీతిలో ఇంటిబాట పట్టింది.

చదవండి: ఇలాంటి తోడు ఉంటే ఏదైనా సాధ్యమే! ప్రేమ, పెళ్లి.. రెయిన్‌బో బేబీ!
నాడు పాక్‌లో తలదాచుకున్న కుటుంబం.. డాక్టర్‌ కావాలనుకున్న రషీద్‌ ఇప్పుడిలా

Advertisement
 
Advertisement