
2023 వన్డే ప్రపంచకప్ ముందు బంగ్లాదేశ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా వార్మప్ మ్యాచ్‌లతో పాటు అక్టోబర్ 7న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే తమ తొలి వరల్డ్‌కప్ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. గౌహతిలో శ్రీలంకతో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న తమ తొలి వార్మప్ మ్యాచ్‌కు ముందు షకీబ్ ఫుట్‌బాల్ ఆడుతూ గాయపడ్డాడని తెలుస్తుంది.
అతను కోలుకునేందుకు కనీసం వారం రోజుల సమయం పడుతుందని ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ తెలిపింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ.. ఈ న్యూస్ వైరలవుతుంది. వరల్డ్‌కప్ ప్రారంభంకాకుండానే బంగ్లాదేశ్‌ది ఓ వికెట్ పడింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా, బంగ్లాదేశ్ ఇదివరకే తమ ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్ తమీమ్ ఇక్బాల్ సేవలను కోల్పోయిన విషయం తెలిసిందే. షకీబ్‌తో విబేధాల కారణంగా బంగ్లా సెలెక్టర్లు తమీమ్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయలేదు.
బ్యాటింగ్ ఆర్డర్, గాయాల విషయంలో షకీబ్, తమీమ్‌ల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్లు తెలుస్తుంది. తమీమ్‌ను తప్పించి పంతాన్ని నెగ్గించుకున్న షకీబ్ ఇప్పుడు తాను కూడా గాయం బారిన పడి జట్టుకు దూరం కావడంతో బంగ్లా టీమ్ కష్టాల్లో పడింది.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ ఇవాళ (సెప్టెంబర్ 29) తమ తొలి వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడుతుంది. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మరో మ్యాచ్‌లో పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో టాస్ గెలిచిన పాకిస్తాన్, శ్రీలంక జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాయి.
17 ఓవర్ల తర్వాత పాకిస్తాన్ స్కోర్ 76/2గా ఉండగా.. 14 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 103/0గా ఉంది. కివీస్‌తో మ్యాచ్‌లో పాక్ బ్యాటర్లు బాబర్ ఆజమ్ (34), మొహమ్మద్ రిజ్వాన్ (18) క్రీజ్‌లో ఉండగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కుశాల్ మెండిస్ (22), పథుమ్ నిస్సంక (46) క్రీజ్‌లో ఉన్నారు.