Cristiano Ronaldo: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు'

Cristiano Ronaldo Says Most Difficult Time His Life Death Of-Baby Son - Sakshi

ఖతార్‌ వేదికగా నవంబర్‌ 20 నుంచి మొదలుకానున్న ఫిఫా వరల్డ్‌కప్‌ సమరానికి అంతా సిద్ధమైంది. ఇప్పటికే వరల్డ్‌కప్‌లో పాల్గొననున్న జట్లన్నీ ఖతార్‌కు చేరుకున్నాయి. ఈసారి ఎవరో విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో కూడా దేశం తరపున వరల్డ్‌కప్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవలే పియర్స్‌ మోర్గాన్‌ అనే బ్రిటిష్‌ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాంచెస్టర్‌ యునైటెడ్‌తో పాటు ఆ జట్టు మేనేజర్‌ నాకు ద్రోహం చేశారంటూ ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా పియర్స్‌ మోర్గాన్‌ ఇంటర్య్వూ రెండో భాగం కూడా బయటికి వచ్చింది. ఇందులో రొనాల్డో చనిపోయిన తన కొడుకు గురించి తలచుకొని ఎమోషనల్‌ అయ్యాడు. విషయంలోకి వెళితే.. రొనాల్డో ప్రస్తుతం అర్జెంటీనాకు చెందిన మోడల్‌ జార్జినా రోడ్రిగ్జ్‌తో సహజీవనం చేస్తున్నాడు. వీరికి 2017లోనే ఒక కుమార్తె పుట్టింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ జంటకు కవలలు పుట్టారు. అయితే కవలల్లో అమ్మాయి బతకగా.. అబ్బాయి మాత్రం చనిపోయాడు. ఇది రొనాల్డోనూ చాలా బాధించింది. తనకు వారసుడు పుట్టాడనే ఆనందం అంతలోనే ఆవిరైందన్న బాధ రొనాల్డోలో స్పష్టంగా కనిపించింది.

తాజాగా ఇదే విషయాన్ని రొనాల్డో పియర్స్‌ మోర్గాన్‌ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. ''మనకు పిల్లలు పుట్టబోతున్నారని తెలిస్తే అంతా నార్మల్‌గా జరగాలని కోరుకుంటాం. కానీ పుట్టిన సమయంలో సమస్య తలెత్తి పురిట్లోనే బిడ్డ చనిపోతే ఎలా ఉంటుంది. ఆ బాధను నేను దగ్గరి నుంచి అనుభవించాను. ఈ విషయంలో నాకంటే జార్జినా ఎక్కువగా బాధపడడం సహజం.

ఎందుకంటే మాతృత్వం అనేది చాలా గొప్పది. ఆ క్షణంలో అలా జరిగిపోయేసరికి మాకు చాలా క్లిష్టంగా అనిపించింది. నిజంగా ఆ సమయంలో మా జీవితంలో ఏం జరిగిందో కూడా కొంతకాలం అర్థం కాలేదు. నిజంగా నా కొడుకుకు పురిట్లోనే పోగొట్టుకోవడం చాలా బాధించింది. మా నాన్న చనిపోయిన రోజున ఎంత బాధపడ్డానో అదే బాధను నా కొడుకు చనిపోయిన రోజున అనుభవించాను. మనల్ని ద్వేషించే వాడికి కూడా ఈ కష్టం రాకూడదని ఆరోజు కోరుకున్నా'' అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఇక పియర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ రెండు బాగాలుగా విడుదల చేశారు. ఈ బుధవారం, గురువారం రొనాల్డో ఫుల్‌ ఇంటర్య్వూ వీడియోను అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో వీక్షించొచ్చు

చదవండి: Cristiano Ronaldo: 'ద్రోహం చేశారు'.. రొనాల్డో సంచలన వ్యాఖ్యలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top