నా లక్ష్యానికి పరిమితి లేదు.. ఒలింపిక్స్‌ కంటే కూడా: నీరజ్‌చోప్రా

Comment by World Champion Neeraj Chopra - Sakshi

ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వగలను

ప్రపంచ చాంపియన్‌ నీరజ్‌ చోప్రా వ్యాఖ్య   

 ఒలింపిక్స్‌ స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణం, ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ చాంపియన్, ఆసియా క్రీడల స్వర్ణం, కామన్వెల్త్‌ క్రీడల స్వర్ణం, జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌... భారత జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా అసాధారణ కెరీర్‌లో అందుకున్న అద్భుత విజయాలెన్నో.

వాస్తవంగా ఈ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుంటే మేజర్‌ ఈవెంట్లలో అతను సాధించేందుకు ఇక ఏమీ మిగలనట్లే! కానీ నీరజ్‌ మాత్రం తాను ఇంకా సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని చెబుతున్నాడు. జావెలిన్‌ను మరింత బలంగా, మరింత దూరం విసరగలనని అతను చెబుతున్నాడు.   

బుడాపెస్ట్‌ (హంగేరి): ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన ప్లేయర్‌గా కొత్త చరిత్ర సృష్టించిన నీరజ్‌ చోప్రా భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానని వ్యాఖ్యానించాడు. పసిడి పతకం గెలిచినందుకు నీరజ్‌ చోప్రాకు 70 వేల డాలర్ల (రూ. 57 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ ఈవెంట్‌లో నీరజ్‌ పసిడి పతకం గెలిచాక మీడియాతో పంచుకున్న భావాలు అతని మాటల్లోనే... 

త్రోయర్లకు ఎప్పటికీ ఫినిషింగ్‌ లైన్‌ అనేదే ఉండదు అంటారు. మా చేతుల్లో జావెలిన్‌ ఉన్నంత వరకు ఎంత దూరమైన విసరగలం. మా లక్ష్యానికి పరిమితి లేదు. నేను ఎన్ని పతకాలు గెలిచినా ఇంకా ఎక్కువ దూరం బల్లెంను విసరాలనే ప్రేరణ అలాగే ఉంటుంది. ఈ పతకాల వల్ల నేను ఇప్పటికే అన్నీ సాధించానని అనుకోను. మరింత కష్టపడి నా దేశానికి మరిన్ని పతకాలు తీసుకొస్తా. పోడియంపై నా పక్కనే ఎవరైనా భారతీయులు నిలబడగలిగితే అది ఇంకా బాగుంటుంది. 

♦ 90 మీటర్ల దూరం కూడా సాధ్యమే. అయితే సాధారణంగా దృష్టంతా గెలుపుపైనే ఉంటుంది. గత కొంత కాలంగా 90 మీటర్ల దూరంపై చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సాధించగలననే అనుకున్నా గాయాల వల్ల కొంత ఇబ్బంది పడ్డా. అయితే ఈ విషయంపై ఒత్తిడి పెంచుకోదల్చుకోలేదు. అయితే ఒక ఈవెంట్‌లో అన్నింటికంటే పతకం గెలవడం ముఖ్యం. ఒక్కసారి 90 మీటర్ల మార్క్‌ అందుకుంటే అదే నిలకడను కొనసాగించాలని నేను నమ్ముతా. ఒలింపిక్‌ క్రీడల తర్వాత వరల్డ్‌ చాంపియన్‌ ఎలాగైనా గెలవాలని భావించా. ఇప్పుడు ఆ కల నిజమైంది. 

♦ భారత ఆల్‌టైమ్‌ గ్రేట్‌ అథ్లెట్‌ అని నా గురించి నేను ఏనాడూ చెప్పుకోలేదు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ చెప్పను. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ స్వర్ణం లేదని ఇప్పటి వరకు కొందరు అన్నారు. ఇప్పుడు దానిని సాధించాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దానిపైనే దృష్టి పెడతాను తప్ప ఇలాంటి చర్చలోకి రాను. నిజంగా గ్రేటెస్ట్‌ ఎలా ఉండాలని అడిగితే మాత్రం నేను  ఆరాధించే చెక్‌ రిపబ్లిక్‌ త్రోయర్‌ జాన్‌ జెలెజ్నీలాగా ఉండాలని చెబుతా. 

♦ నా దృష్టిలో ఒలింపిక్స్‌తో పోలిస్తే ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనే గట్టి పోటీ ఉంటుంది. టాప్‌ అథ్లెట్లంతా దీని కోసమే సన్నద్ధమై వస్తారు. భవిష్యత్తులో భారత అథ్లెట్లు మరిన్ని విజయాలు సాధిస్తారు. పాకిస్తాన్‌ ఆటగాడు అర్షద్‌ నదీమ్‌తో పోటీని ప్రత్యేకంగా చూడవద్దు. మా ఆటను భారత్, పాకిస్తాన్‌ మధ్య పోరుగా కొందరు చిత్రీకరిస్తున్నారు.

నా ఫోన్‌లో కూడా అంతా భారత్, పాక్‌ గురించే మెసేజ్‌లు ఉన్నాయి. మన దేశంలో ఇలాంటి వాతావరణం సహజమే. కానీ దీనిని మా ఇద్దరి మధ్య పోటీగా చూడవద్దు. రెండు దేశాల పేర్లతో ఒత్తిడి పెంచవద్దు. ఈవెంట్‌లో ఇతర ప్రత్యర్థులందరినీ దృష్టిలో ఉంచుకొని సిద్ధం కావాల్సి ఉంటుంది. సరిగా చూస్తే యూరోపియన్లతో పోటీ పడి రెండు దేశాలు విజయాలు సాధించడం మంచి పరిణామం.  

రూ. 57 లక్షల 84 వేలు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి నీరజ్‌ 70 వేల డాలర్ల (రూ. 57 లక్షల 84 వేలు) ప్రైజ్‌మనీ అందుకున్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top