
అక్టోబర్‌లో దిగ్గజాల మధ్య చెస్ పోరు
న్యూఢిల్లీ: ఇద్దరు చదరంగ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గ్యారీ కాస్పరోవ్ మరోసారి ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమవుతున్నారు. అక్టోబర్‌లో అమెరికాలోని సెయింట్ లూయిస్ వేదికగా జరగనున్న క్లచ్ చెస్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల్లో ఈ దిగ్గజాలు ఎత్తులు పైఎత్తులు వేయనున్నారు. క్లాసికల్ ఫార్మాట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్, ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) మధ్య కూడా గేమ్‌లు జరగనున్నాయి.
ప్రపంచ చదరంగంలో అత్యుత్తమ ఆటగాళ్లుగా గుర్తింపు సాధించిన ఆనంద్, కాస్పరోవ్ మధ్య ఇప్పటి వరకు 82 గేమ్‌లు జరిగాయి. చివరిసారిగా 2021లో క్రొయేషియా ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నమెంట్‌లో ఈ ఇద్దరు తలపడగా... భారత గ్రాండ్‌మాస్టర్ విజయం సాధించాడు. ‘ఇద్దరు ప్రపంచ మాజీ చాంపియన్‌లు గ్యారీ కాస్పరోవ్, విశ్వనాథన్ ఆనంద్... క్లచ్ చెస్ (లెజెండ్స్) ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో తలపడనున్నారు. అక్టోబర్ 7 నుంచి 11 మధ్య ఈ టోర్నీ జరగనుంది. తరానికి ఒక్కసారి జరిగే మ్యాచ్ ఇది’ అని సెయింట్ లూయిస్ క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 1 కోటీ 25 లక్షలు కాగా... ఇద్దరు దిగ్గజాల మధ్య 12 గేమ్‌లు నిర్వహించనున్నారు. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఇక ఇదే వేదికపై అక్టోబర్ 27 నుంచి 29 వరకు ప్రస్తుత అగ్రశ్రేణి ఆటగాళ్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్, రెండో ర్యాంకర్ నకముర, మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా, ప్రపంచ స్టార్ గుకేశ్ తదితరులు పాల్గొననున్నారు.
ఈ టోర్నీలో విజేతగా నిలిచిన వారికి భారీ ప్రైజ్‌మనీ దక్కనుంది. ‘ఈ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 3 కోట్ల 58 లక్షలు. దీంతో పాటు ప్లేయర్లకు ప్రతిరోజు బోనస్, విజేతకు జాక్‌పాట్ వంటి ఎన్నో ఇతర ప్రయోజనాలు ఉంటాయి’ అని నిర్వాహకులు తెలిపారు. డబుల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో నిర్వహించనున్న ఈ పోటీల్లో 18 గేమ్‌లు జరుగుతాయి.