
లండన్: ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ చెల్సీ పెద్ద మనసు చాటుకుంది. గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోర్చుగల్ యువ మిడ్‌ఫీల్డర్, లివర్‌పూల్ క్లబ్ ఫార్వర్డ్ డీగో జోటా కుటుంబానికి ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది జరిగిన క్లబ్ వరల్డ్‌కప్ ఫైనల్లో చెల్సీ జట్టు 3–0తో యూఈఎఫ్‌ఏ చాంపియన్ పారిస్ సెయింట్ జర్మయిన్ (పీఎస్‌జీ)పై ఘనవిజయం సాధించింది. దీంతో క్లబ్‌కు ప్రైజ్‌మనీతో పాటు బోనస్ కలిపి మొత్తం 11.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.100 కోట్లు) లభించాయి.
ఈ మొత్తాన్ని ఆటగాళ్లంతా సమాన భాగాలు చేశారు. ఇందులో నుంచి 5 లక్షల డాలర్లు (రూ.4.38 కోట్లు) మృతి చెందిన లివర్‌పూల్ క్లబ్ ప్లేయర్ డీగో జోటా కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు చెల్సీ సిద్ధమైంది. ఈ మేరకు చెల్సీ క్లబ్ గురువారం అధికారికంగా ప్రకటించింది. పోర్చుగల్‌కు చెందిన జోటా పావోస్ డి ఫెరీరాతో ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించాడు.
తర్వాత 2016లో అట్లిటికో మాడ్రిడ్‌తో జట్టు కట్టాక కెరీర్‌లో ఊపందుకున్నాడు. ప్రీమియర్ లీగ్‌లో వాల్వొర్‌హాంప్టన్ వాండరర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత 2020 నుంచి లివర్‌పూల్ జట్టుకు ఆడుతున్నాడు. 2024–2025 ఇంగ్లండ్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో లివర్‌పూల్ చాంపియన్‌గా నిలిచింది.