
దేశవాళీ ఫుట్‌బాల్‌లో మేటి జట్టు ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ మరో ఘనతను సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్‌సీ) మహిళల చాంపియన్స్ లీగ్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. భారత మహిళల లీగ్ చాంపియన్ హోదాలో ఆసియా చాంపియన్స్ లీగ్ ప్రిలిమినరీ టోర్నీలో ఈస్ట్ బెంగాల్ జట్టు పోటీపడే అవకాశాన్ని దక్కించుకుంది. కంబోడియాలో జరిగిన ఈ టోర్నీలో గ్రూప్ ‘ఇ’లో బరిలోకి దిగిన ఈస్ట్ బెంగాల్ జట్టు నాలుగు పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచి ముందంజ వేసింది.
కిచీ స్పోర్ట్స్ క్లబ్ (హాంకాంగ్)తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను ఈస్ట్ బెంగాల్ 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఈస్ట్ బెంగాల్ తరఫున సంగీత (11వ నిమిషంలో), కిచీ స్పోర్ట్స్ క్లబ్ తరఫున హో ముయ్ మె (59వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. తొలి మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ 1–0తో ఫొనోమ్ పెన్ క్రౌన్ (కంబోడియా)పై గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గోల్ చేయకపోయినా... తెలంగాణ అమ్మాయి, భారత జట్టు ఫార్వర్డ్ సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. గత సీజన్‌కుగాను భారత ‘ఉత్తమ మహిళా ఫుట్‌బాలర్’గా ఎంపికైన సౌమ్య దూకుడుగా ఆడి తమ జట్టుకు గోల్ అవకాశాలను సృష్టించింది. ఆసియాలోని 12 క్లబ్ జట్లు పోటీపడే చాంపియన్స్ లీగ్ అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మే వరకు మూడు అంచెల్లో జరుగుతుంది.