
కెరీర్‌లో ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు విజయం దూరంలో స్పెయిన్ స్టార్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్‌కరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అల్‌కరాజ్ 4–6, 7–6 (7/3), 6–0, 2–0తో ఎనిమిదో సీడ్ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. నాలుగో సెట్‌లో అల్‌కరాజ్ 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా ముసెట్టి వైదొలిగాడు. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌కు తొలి రెండు సెట్‌లలో ఊహించని ప్రతిఘటన ఎదురైంది.
తొలి సెట్‌ను కోల్పోయిన అల్‌కరాజ్ రెండో సెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి పుంజుకున్నాడు. మూడో సెట్‌లో ముసెట్టి ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయాడు. నాలుగో సెట్‌లో రెండు గేమ్‌లు ముగిశాక ముసెట్టి తొడ కండరాల గాయంతో ఆటను కొనసాగించలేనని చైర్ అంపైర్‌కు తెలపడంతో మ్యాచ్‌ను నిలిపివేసి అల్‌కరాజ్‌ను విజేతగా ప్రకటించారు. దాంతో 22 ఏళ్ల అల్‌కరాజ్ తన కెరీర్‌లో ఐదోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
గతంలో ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల ఫైనల్స్‌లో (2022 యూఎస్ ఓపెన్; 2023, 2024 వింబుల్డన్; 2024 ఫ్రెంచ్ ఓపెన్) అల్‌కరాజే గెలుపొందడం విశేషం. సినెర్ (ఇటలీ), జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో ఆదివారం ఫైనల్లో అల్‌కరాజ్ తలపడతాడు.
శనివారం మహిళల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. ప్రపంచ నంబర్‌వన్ సబలెంకా (బెలారస్), ప్రపంచ రెండో ర్యాంకర్ కోకో గాఫ్ (అమెరికా) టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నారు. సబలెంకా తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకోగా ... 2022లో రన్నరప్‌గా నిలిచిన కోకో గాఫ్ రెండోసారి టైటిల్ పోరుకు అర్హత పొందింది.