Brian Lara: కీలక పదవిలో బ్రియాన్‌ లారా.. గాడిన పెట్టేందుకేనా!

Brian Lara Takes-Up Performance Mentor Role For West Indies Cricket - Sakshi

వెస్టిండీస్‌ దిగ్గజ బ్యాటర్‌ బ్రియాన్‌ లారాను కీలక పదవి వరించింది. దశ దిశ లేకుండా ఉన్న విండీస్‌ జట్టును గాడిన పెట్టేందుకు లారాను పర్‌ఫార్మెన్స్‌ మెంటార్‌(Performance Mentor)గా బాధ్యతలు అప్పజెప్పింది. కొన్నాళ్లుగా విండీస్‌ జట్టు ప్రదర్శన నాసిరకంగ తయారైంది. చిన్న జట్ల చేతిలోనూ అనూహ్యంగా పరాజయాలు చవిచూస్తూ అవమానాలు ఎదుర్కొంటుంది.

ఈ నేపథ్యంలోనే విండీస్‌ను గాడిన పెట్టేందుకే లారాను ఈ పదవికి ఎంపిక చేసినట్లు క్రికెట్‌ వెస్టిండీస్‌(సీడబ్ల్యూఐ) పేర్కొంది. మూడు ఫార్మాట్లలో జాతీయ జట్టు, బోర్డు అకాడమీ కోసం పనిచేయనున్నాడు. ఆటగాళ్లకు వ్యూహాత్మక సలహాలను అందించడంలో, వారి గేమ్ సెన్స్‌ను మెరుగుపరచడంలో ప్రధాన కోచ్‌లకు సహాయం చేయడమే లారా పని అని  బోర్డు తెలిపింది.

''ఆస్ట్రేలియాలోని ఆటగాళ్లు, కోచ్‌లతో సమయం గడిపాను. సీడబ్ల్యూఐతో చర్చించాను. గేమ్ విషయంలో ఆటగాళ్లకు సహాయం చేయగలనని నేను నమ్ముతున్నా. అలాగే వారి వ్యూహాలను మరింత విజయవంతంగా అమలు చేసేలా సాయం చేయగలను. వారితో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నా'' అని  లారా పేర్కొన్నాడు. వచ్చే వారంలో జింబాబ్వే, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు జరగనుంది. ముందుగా టెస్ట్ టీమ్ తో కలిసి లారా పనిచేయనున్నాడు.

క్రికెట్‌లో దిగ్గజంగా పేరు పొందిన లారా తన కెరీర్‌లో విండీస్‌ తరపున  131 టెస్టులు ఆడి 52.88 సగటుతో 11,953 పరుగులు చేశాడు. వన్డేల్లో 10,405 పరుగులు కొట్టాడు. 2004లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్ లో 400 పరుగులు కొట్టి రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో 400 రన్స్(క్వాడ్రపుల్‌ సెంచరీ) కొట్టింది లారా ఒక్కడే. 19 ఏళ్లు దాటినా ఇప్పటికి లారా రికార్డు చెక్కుచెదరలేదు.

చదవండి: మహిళల టి20 వరల్డ్‌కప్‌: కివీస్‌పై గెలుపు.. ఫైనల్లో భారత్‌

క్రిస్టియానో రొనాల్డోకు అవమానం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top