ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి
భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్‌ను ఓ మతంలా భావిస్తూ.. క్రికెటర్లను దేవుళ్లలా ఆరాధించే అభిమానులు కోకొల్లలు. ఇక పొట్టి ఫార్మాట్లో సాగే దేశీ క్రేజీ టోర్నీ ఐపీఎల్‌కు ఉన్న వీరాభిమానుల గురించి కూడా తెలిసిందే.
ఆటగాళ్ల పాదాలు తాకేందుకు మైదానంలోకి దూసుకువెళ్లి.. భద్రతా సిబ్బందితో గెంటేయించుకునేవాళ్లు కొందరైతే.. తమ ఫేవరెట్ ప్లేయర్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడని వెర్రి అభిమానం మరికొందరిది.
రూ. 8 వేల టికెట్‌ను రూ. 80 వేలకు పెంచి
ఈ ‘పిచ్చి’నే క్యాష్ చేసుకుంటున్నారు బ్లాక్ టికెట్ల దందా నిర్వాహకులు. రూ. 8 వేల టికెట్‌ను ఏకంగా రూ. 80 వేలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు ఇటీవలే ఈ విషయాన్ని గుర్తించి పలువురు నిందితులను అరెస్టు చేశారు.
కంచే చేను మేసినట్లుగా!
ఈ బ్లాక్ టికెట్ల దందాలో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధికారిదే కీలక పాత్ర అని తేల్చినట్లు సమాచారం. ఈ విషయం గురించి డీడీసీఏ సన్నిహిత వర్గాలు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇదొక వ్యవస్థీకృత నేరం. ఇందులో డీడీసీఏ అధికారి ఒకరిది కీలక పాత్ర. ఆటగాళ్ల క్రేజ్‌ను బట్టి టికెట్ల ధరలు నిర్ణయిస్తారు.
మ్యాచ్ ఆరంభమయ్యే కాసేపటికి ముందు ధరలు ఇష్టారీతిన పెంచి సొమ్ము చేసుకుంటారు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సమయంలో రేట్లు దారుణంగా పెంచారు.
విరాట్ కోహ్లిని చూసేందుకు
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని చూసేందుకు అభిమానులు ఎగబడతారన్న సంగతి తెలిసిందే. అందుకే ఆరోజు బ్లాక్‌లో రూ. 8 వేల టికెట్‌ను ఏకంగా 80 వేల రూపాయలకు అమ్మారు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
కాగా ఈ ఘటనలో ముకీమ్, గుఫ్రాన్, ఫైజల్ అనే వ్యక్తులతో పాటు పెట్రోల్ బంకు ఉద్యోగి పంకజ్ యాదవ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు అరుణ్‌జైట్లీ మైదానం హోంగ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఆతిథ్య డీడీసీఏకు ప్రతీ మ్యాచ్‌కు సంబంధించి ఫ్రాంఛైజీ 10- 15 శాతం టికెట్లను కాంప్లిమెంటరీ పాసులుగా ఇస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు వెయ్యి కాంప్లిమెంటరీ పాసులను డీడీసీఏ అధికారి అక్రమంగా అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో అభిమానుల పాట్లు!
మే 22న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటూ సన్ రైజర్స్ యాజమాన్యం మ్యాచ్ టికెట్ల ధరలు భారీగా పెంచినట్లు తెలుస్తోంది.
డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాగా.. క్యూ లో 2.6 లక్షల మంది ఉన్నట్లు కనిపించింది. ఆ తర్వాత కాసేపట్లో సోల్డ్ ఔట్ అని పెట్టారు. ఈ నేపథ్యంలో టికెట్లను బ్లాక్ మార్కెట్ లోకి మళ్లిస్తున్నారని అభిమానులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు.
ఈ క్రమంలో రూ. 950 టికెట్ 2000లకు... 1500 ఉన్న టికెట్ 3000లకు.. 1910 ఉన్న టికెట్ 3500లకు.. 2500 ఉన్న టికెట్ 4500లకు.. 4500 ఉన్న టికెట్ 6000లకు.. 7000 ఉన్న టికెట్ ధర 10 వేల రూపాయలకు.. 23 వేలు ఉన్న బాక్స్ టికెట్ ధర 30 వేల రూపాయలకు.. 30 వేలు ఉన్న కార్పోరేట్ బాక్స్ టికెట్ ధర 45 వేలకు పెంచినట్లు సమాచారం.
చదవండి: సెలక్టర్లు చెప్పినా నేను ద్రవిడ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: గంగూలీ


