breaking news
Delhi and District Cricket Association
-
ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌కు బాంబు బెదిరింపులు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. భారత్ తమ సైనిక చర్యలతో దాయాది దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇండియన్ ఆర్మీ.. డ్రోన్లు, క్షిపణులతో ఉగ్ర శిబిరాలు, సైనిక స్థావరాలపై దాడి చేస్తూ పాకిస్తాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది.పాక్ కూడా సరిహద్దు వెంబడి తీవ్ర స్ధాయిలో కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేకాకుండా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ముఖ్య నగరాల్లో డ్రోన్ దాడికి యత్నించి పాక్ విఫలమైంది. ప్రస్తుతం ఇరు దేశాల్లోనూ యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియానికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. అరుణ్ జైట్లీ స్టేడియంను పేల్చివేస్తామని పేర్కొంటూ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కు శుక్రవారం బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని డీడీసీఎ అధికారి ఒకరు ధ్రవీకరించారు."మీ స్టేడియంలో బాంబు పేలుడు జరుగుతుంది. భారత్‌లో పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ బ్లాస్ట్‌తో ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చు కుంటామని" మెయిల్లో రాసి ఉన్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు. కాగా ఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీ క్యాపిటల్స్ హోం గ్రౌండ్‌గా ఉంది. ఈ అరుణ్ జైట్లీ స్టేడియం మే 11న గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కానీ ఐపీఎల్-2025ను వారం రోజుల పాటు బీసీసీఐ తాత్కాలికంగా నిలిపివేసింది. -
డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ..
న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ)అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ మూడోసారి ఎన్నికయ్యాడు. తాజా ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌పై రోహన్ జైట్లీ విజయం సాధించాడు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన రోహన్ డీడీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం.డీడీసీఏలో మొత్తం 3,748 ఓట్లకు గానూ... 2,413 మంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయానికి 1207 ఓట్లు అవసరం కాగా... 35 ఏళ్ల రోహన్ జైట్లీ 1,577 ఓట్లతో ఘన విజయం సాధించాడు. 1983లో వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్‌కు 777 ఓట్లు వచ్చాయి.రోహన్ జైట్లీ తండ్రి దివంగత అరుణ్ జైట్లీ గతంలో 14 ఏళ్ల పాటు డీడీసీఏ అధ్యక్షుడిగా కొనసాగారు. 2020లో రజత్ శర్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో తొలిసారి డీడీసీఏ అధ్యక్షుడిగా ఏకగీవ్రంగా ఎన్నికైన రోహన్ జైట్లీ... ఏడాది తర్వాత జరిగిన ఎన్నికల్లో వికాస్ సింగ్‌పై విజయం సాధించి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.బీసీసీఐ మాజీ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా సహకారంతో రోహన్ సులువుగా ఈ ఎన్నికల్లో విజయం సాధించాడు. సీకే ఖన్నా కూతురు శిఖా తాజా ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలిగా ఘనవిజయం సాధించింది. కార్యదర్శిగా అశోక్ శర్మ, కోశాధికారిగా హరీశ్ సింగ్లా జాయింట్ సెక్రటరీగా అమిత్ గ్రోవర్ ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం మూడేళ్ల పాటు కొనసాగనుంది. -
మహిళలపై వేధింపులు.. ఇద్దరి క్రికెటర్లపై వేటు
ఢిల్లీ: మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు క్రికెటర్లపై ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) వేటు వేసింది. ప్రస్తుతం ఆ క్రికెటర్లు ఢిల్లీ తరుపున అండర్-23 క్రికెట్ ఆడుతున్నారు. టీమ్ మేనేజర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ క్రికెటర్ల భవిష్యత్‌పై నిర్ణయం తీసుకంటామని డీడీసీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి డీడీసీఎ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా బెంగాల్‌తో మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు కోల్‌కతాకు వెళ్లింది. స్థానికంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఢిల్లీ క్రికెటర్లు పాల్గొన్నారు. వేడుకల అనంతరం ఇద్దరు క్రికెటర్లు కొంతమంది మహిళలను వెంబడిస్తూ వారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా ఆ మహిళలు బస చేస్తున్న హోటల్‌కు వెళ్లి వేధింపులకు గురిచేశారు. దీంతో హోటల్ సిబ్బందికి వారు ఫిర్యాదు చేయడంతో ఆ క్రికెటర్లను బయటకి పంపించేశారు. ఈ విషయం తెలుసుకున్న డీడీసీఏ వెంటనే ఆ ఇద్దరు క్రికెటర్లపై వేటు వేసి ఢిల్లీకి వెనక్కి రప్పించింది. అంతేకాకుండా ఈ ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని టీమ్ మేనేజర్‌ను కోరింది. వీరి స్థానంలో మరో ఇద్దరి ఆటగాళ్లను కోల్‌కతాకు డీడీసీఏ పంపించింది. ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని, అందరూ క్రమశిక్షణతో ఉండాలని హెచ్చరించింది. అయితే ఆ ఇద్దరి క్రికెటర్ల వివర్లను తెలపడానికి డీడీసీఏ నిరాకరించింది. -
డీడీసీఏకు ఢిల్లీ హైకోర్టు షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘా(డీడీసీఏ)నికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ నియమించిన ముగ్గురు సెలక్టర్లను తొలగిస్తూ డీడీసీఏ తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ విషయంలో డీడీసీఏ హద్దు మీరి ప్రవర్తించిందని, ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని జస్టిస్ రవీంద్ర భట్, దీపా శర్మలతో కూడిన బెంచ్ తీవ్రంగా తప్పుపట్టింది. ఢిల్లీ క్రికెట్ సంఘానికి చెందిన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గతంలోనే ఆ రాష్ట్ర హైకోర్టు జస్టిస్ ముకుల్ ముద్గల్‌ను నియమించింది. అలాగే 48 గంటల్లోగా ఆటగాళ్లకు బకారుులు చెల్లించాల్సిందిగా డీడీసీఏను కోర్టు ఆదేశించింది. -
జైట్లీపై కేజ్రీ‘వార్’
పరస్పర ఆరోపణలు విమర్శలతో ముదురుతున్న రగడ జైట్లీ తప్పుకోవాలి.. లేదా తప్పించాలి: కేజ్రీవాల్ డిమాండ్ * జైట్లీ హయాంలో డీడీసీఏలో భారీ ఆర్థిక అవకతవకలు: ఆప్ * దృష్టి మరల్చేందుకు కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం: జైట్లీ * యూపీఏ హయాంలోనే జైట్లీకి ఎస్ఎఫ్ఐఓ క్లీన్చిట్: బీజేపీ న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయంలో సీబీఐ సోదాల నేపథ్యంలో ఢిల్లీ సర్కారుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య రాజుకున్న రగడ ముదురుతోంది. కేంద్రమంత్రి జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్నపుడు భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని, అందుకు సంబంధించిన ఫైలు కోసమే సీబీఐ దాడులు జరిపిందని ఆరోపించిన కేజ్రీవాల్.. జైట్లీపై తన దాడిని ఉధృతం చేశారు. డీడీసీఏ అవినీతిపై నిష్పాక్షిక దర్యాప్తు జరగటానికి కేంద్ర మంత్రివర్గం నుంచి జైట్లీ తప్పుకోవాలని.. లేదంటే ప్రభుత్వమే ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ ఆరోపణలపై జైట్లీ ఎదురుదాడికి దిగారు. ఆయన అవినీతి అధికారిని రక్షిస్తున్నారని.. దృష్టి మరల్చేందుకు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ గళం పెంచగా, జైట్లీకి బీజేపీ వెన్నుదన్నుగా నిలిచింది. దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారు?: కేజ్రీవాల్ జైట్లీని ఉచ్చులో బిగించే డీడీసీఏ ఫైలు కోసమే సీబీఐ తన కార్యాలయంపై దాడులు నిర్వహించిందని కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ‘‘తనపై ఆప్ చేసిన ఆరోపణలు నిరాధారమని, నిర్దిష్టమైనవి కావని జైట్లీ ఉద్ఘాటించటాన్ని పరమసత్యంగా పరిగణించరాదు.. ఆయనపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి. భారీ మొత్తాలు ఉన్నాయి. ఆయన దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారు? జైట్లీ ఏమీ లేదని నిరాకరిస్తున్నారన్న ప్రాతిపదికతో ఆయనపై దర్యాప్తు జరపకుండా వదిలిపెట్టేట్లయితే.. బొగ్గు, 2జీ కేసుల్లో నిందులను కూడా అలాగే వదిలిపెట్టాలా? స్వతంత్ర దర్యాప్తుకు వీలు కలిగించేందుకు ఆయన పదవికి రాజీనామా చేయాలి.. లేదా ఆయన్ను తొలగించాలి’’ అని కేజ్రీవాల్ గురువారం వరుస ట్వీట్లలో డిమాండ్ చేశారు. భారీ మొత్తాలు దారిమళ్లించారు: ఆప్ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న 13 ఏళ్ల కాలంలో ఆ సంఘంలో భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. భారీ స్థాయిలో నిధులను నకిలీ సంస్థల ద్వారా దారి మళ్లించారని.. క్రికెట్ టీమ్ ఎంపికలు సహా ఇతర అక్రమాలు కూడా జరిగాయని పేర్కొంది. ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్చద్దా, పార్టీ ఇతర నేతలతో కలిసి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ డీడీసీఏ అంతర్గత దర్యాప్తు సంఘమైన ఎస్ఎఫ్ఐఓ నివేదిక, ఢిల్లీ ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ నివేదికలను ఉటంకిస్తూ జైట్లీపై ఆరోపణలు గుప్పించారు. ‘‘ఢిల్లీ క్రికెట్ సంఘానికి జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఆ సంఘంలో భారీ అవినీతికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సమ్మతి తెలిపారని ధ్వజమెత్తింది. ఈ కేసులో దర్యాప్తు చేసే అధికారం గల కొన్ని దర్యాప్తు సంస్థలు ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలో ఉన్నందున.. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగటం కోసం జైట్లీ రాజీనామా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరాలి’’ అని డిమాండ్ చేశారు. జైట్లీది మచ్చలేని రాజకీయ చరిత్ర: బీజేపీ జైట్లీది నిష్కళంకమైన రాజకీయ చరిత్ర అని, ఆయనపై ఆరోపణలు దురుద్దేశంతో కూడుకున్నవని బీజేపీ ఖండించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అరుణ్జైట్లీది నిష్కళంకమైన రాజకీయ చరిత్ర. ఆయనపై ఆరోపణలు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పనిచేస్తున్న ఒక అవినీతి అధికారిపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ చిత్తచాంచల్యం వంటి దూషణాత్మకమైన అసంబద్ధ ప్రచారం. యూపీఏ హయాంలో డీడీసీఏ వ్యవహారాలపై దర్యాప్తు జరిపిన ఎస్ఎఫ్ఐఓ జైట్లీకి క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయటం ఆ పార్టీ రాజకీయ కపటత్వాన్ని బహిర్గతం చేస్తోంది. జైట్లీపై ఆరోపణల ద్వారా ప్రజా దృష్టిని మరల్చాలన్న ఆప్ దురుద్దేశాన్ని బీజేపీ బహిరంగంగా ఖండిస్తోంది. జైట్లీకి మద్దతుగా పార్టీ దృఢంగా నిలుస్తోంది’’ అని పేర్కొన్నారు. జైట్లీపై ఆరోపణలు నిరాధారం: డీడీసీఏ జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నపుడు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆప్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని డీడీసీఏ ఖండించింది. జైట్లీ క్రికెట్ క్రీడను మెరుగుపరచటం కోసం కృషిచేశారని, ఫిరోజ్‌షా కోట్లా స్టేడియాన్ని ప్రపంచ స్థాయికి పెంచారని.. ఆయనను ఈ వివాదంలోకి లాగటం అనుచితమని పేర్కొంది. ఈ సందర్భంగా.. స్టేడియం పునరుద్ధరణకు అయిన వ్యయానికి సంబంధించిన వివరాలను చదివి వినిపించారు. దృష్టి మరల్చేందుకు తప్పుడు ప్రచారం: జైట్లీ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ జైట్లీ ఎదురుదాడికి దిగారు. ఆయన గురువారం ఇంటర్నెట్ బ్లాగ్‌లో రాయటంతో పాటు, ఢిల్లీలో మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. ‘‘ఈ ఆరోపణల్లో ఇసుమంతైనా వాస్తవం లేదు. అసత్యాలు చెప్పటం, అపనిందలు వేయటాన్ని ఆయన విశ్వసిస్తున్నట్లు.. అపస్మారక స్థితికి దగ్గరైన భాషను ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. డీడీసీఏ ఉదంతం.. స్వయంగా తానే బోనులో ఉన్నపుడు ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే ప్రచార ఎత్తుగడలో భాగం. అవినీతి కేసులో దర్యాప్తు ఎదుర్కొంటున్న ఒక అధికారిని రక్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. నేను క్రికెట్ పర్యవేక్షణను 2013 లో వదిలిపెట్టాను. గతంలో ఢిల్లీ క్రికెట్ వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తును సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ)కు యూపీఏ సర్కారు అప్పగించింది. అది 2013 మార్చి 21న నివేదిక ఇచ్చింది. ఎటువంటి మోసం కనిపించలేదని స్పష్టంచేసింది. డీడీసీఏ అధ్యక్షుడిగా నా పాత్ర ఒక కంపెనీలో రోజు వారీ వ్యవహారాలకు సంబంధం లేని నాన్-ఎగ్జిక్యూటివ్ (నిర్వహణాధికారం లేని) చైర్మన్ పాత్ర వంటిది’’ అని పేర్కొన్నారు. ఆప్ ‘విరాళాల’పై సీబీఐ దర్యాప్తుకు ఢిల్లీ హైకోర్టు నో ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో విరాళాల సేకరణలో విదేశీ మాదకద్రవ్య నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న వినతిని ఢిల్లీ హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. దీనికి సంబంధించిన ఒక ఫిర్యాదును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేసిందని పేర్కొంది.