
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో తమ చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీకి శుభవార్త అందింది. గాయం కారణంగా గత కొద్ది మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తిరిగి అందుబాటులోకి వచ్చాడు. హాజిల్‌వుడ్ నిన్న (మే 24) రాత్రి ఆర్సీబీ క్యాంప్‌లో చేరాడు.
ఆర్సీబీ మే 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు హాజిల్‌వుడ్ అందుబాటులో ఉంటాడు. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ స్థానాన్ని ఖరారు చేయడంలో ఈ మ్యాచ్ అత్యంత కీలకమవుతుంది. లక్నోపై గెలిస్తే ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఏదో ఒక స్థానంలో ముగించవచ్చు.
ఐపీఎల్ పాక్షికంగా వాయిదా పడిన తర్వాత హాజిల్‌వుడ్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని తొలుత వార్తలు వచ్చాయి. గాయంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా షెడ్యూలై ఉండటంతో హాజిల్‌వుడ్ అందుబాటులోకి రావడం అసాధ్యమే అని అంతా అనుకున్నారు.
He's here
ಬಂದ್ಬಿಟ್ಟ
వచ్చేసాడు
வந்துட்டான்
वो आगया
വന്നിരിക്കുന്നു
Welcome back, Josh Reginald Hazlewood! 🫡❤🔥 pic.twitter.com/pttA5DX3N8— Royal Challengers Bengaluru (@RCBTweets) May 25, 2025
అయితే అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ.. హాజిల్‌వుడ్ చివరి లీగ్ మ్యాచ్‌కు (లక్నోతో) ముందే ఆర్సీబీ క్యాంప్‌లో చేరాడు. హాజిల్‌వుడ్ తమ క్యాంప్‌లో చేరిన విషయాన్ని ఆర్సీబీ అధికారికంగా వెల్లడించింది. హాజిల్‌వుడ్ ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీ సాధించిన విజయాల్లో అతనిది కీలకపాత్ర. ప్లే ఆఫ్స్‌కు హాజిల్‌వుడ్ అందుబాటులోకి రావడం ఆర్సీబీ శుభపరిమాణం.
ఇదిలా ఉంటే, హాజిల్‌వుడ్ లేని లోటు ఆర్సీబీలో కొట్టొచ్చినట్లు కనిపించింది. సన్‌రైజర్స్‌తో తాజాగా (మే 23) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు ఏకంగా 231 పరుగులు సమర్పించుకున్నారు. యశ్ దయాల్ 3 ఓవర్లలో 36, భువనేశ్వర్ 4 ఓవర్లలో 43, ఎంగిడి 4 ఓవర్లలో 51, సుయాశ్ శర్మ 3 ఓవర్లలో 45 పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. ఫలితంగా 42 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.