IND VS AUS 3rd Test Day 2: తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉండి కూడా నిప్పులు చెరిగిన ఉమేశ్‌

BGT 2023 IND VS AUS 3rd Test: Umesh Has His 100th Wicket In India - Sakshi

BGT 2023: ఇండోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో మహ్మద్‌ షమీకి రెస్ట్‌ ఇవ్వడంతో చివరి నిమిషంలో తుది జట్టులోకి వచ్చిన ఉమేశ్‌ యాదవ్‌.. అందివచ్చిన అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌లో (13 బంతుల్లో 17; ఫోర్‌, 2 సిక్సర్లు) అత్యంత కీలకమైన పరుగులను మెరుపు వేగంతో సాధించిన ఉమేశ్‌.. ఆ తర్వాత బౌలింగ్‌లో మరింతగా రెచ్చిపోయి స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేయడంతో కీలకంగా వ్యవహరించాడు.

రెండో రోజు తొలి సెషన్‌లో డ్రింక్స్‌ తర్వాత బంతిని అందుకున్న ఉమేశ్‌.. స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై నిప్పులు చెరుగుతూ తొలుత గ్రీన్‌ను ఎల్బీడబ్ల్యూగా ఆతర్వాత స్టార్క్‌ను, మర్ఫీలను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. స్టార్క్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాక ఉమేశ్‌ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. స్టార్క్‌ వికెట్‌తో ఉమేశ్‌ స్వదేశంలో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. ఉమేశ్‌ మెరుపు వేగంతో సంధించిన బంతుల ధాటికి స్టార్క్‌, మర్ఫీ వికెట్లు గాల్లో పల్టీలు కొడుతూ నాట్యం చేశాయి.

తొలి రోజు ఆటలో కూడా ఉమేశ్‌ ఓ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్ట్‌ల్లో ఉమేశ్‌.. యువరాజ్‌ సింగ్‌ (22), రవిశాస్త్రి (22)లను అధిగమించి, కోహ్లి సిక్సర్ల రికార్డును (24) సమం చేశాడు. భారత్‌ తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉమేశ్‌.. కోహ్లితో కలిసి సంయుక్తంగా 17వ స్థానంలో నిలిచాడు. 

ఊహించని విధం‍గా భారత తుది జట్టులోకి వచ్చి రికార్డులు కొల్లగొట్టడంతో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉమేశ్‌.. ఏ పరిస్థితుల్లో ఇలా రాణించాడో తెలిస్తే అతన్ని వ్యతిరేకించే వారు సైతం ప్రశంసించక మానరు. ఉమేశ్‌ ఫిబ్రవరి 23న తన తండ్రిని కోల్పోయాడు. పుట్టెడు దుఖంలో ఉండి కూడా అతడు రాణిం‍చిన తీరు నిజంగా అభినందనీయం.

అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, జట్టుకు ఉపయోగపడాలన్న అతని కమిట్‌మెంట్‌కు ఎంతటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. తండ్రిని కోల్పోయి కనీసం దినవారాలు కూడా గడవకముందే దేశం కోసం అతను సర్వశక్తులు ఒడ్డి పాటుపడుతున్న తీరును ఎంత పొగిడినా తక్కువే. ఉమేశ్‌.. ఈ టెస్ట్‌లో మున్ముందు మరింత కీలకంగా మారి టీమిండియాను గెలిపిం‍చాలని ఆశిద్దాం.

ఇదిలా ఉంటే, 156/4 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. లంచ్‌ విరామం సమయానికి వికెట్‌ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 75 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top