
ముంబై : ఐపీఎల్–2021లో ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లతో పాటు అదనంగా మరో రెండు టీమ్‌లను చేర్చాలనే అంశంపై బీసీసీఐ పునరాలోచనలో పడినట్లు సమాచారం. వచ్చే లీగ్‌ను ప్రస్తుతం ఉన్న తరహాలోనే కొనసాగించి 2022లో పది జట్లను ఆడిస్తే బాగుంటుందని బోర్డులో పలువురి నుంచి సూచనలు వస్తున్నాయి. వచ్చే ఏడాది ఐపీఎల్‌కు చాలా తక్కువ సమయం ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. గురువారం అహ్మదాబాద్‌లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
‘ఐపీఎల్ ఆరంభానికి కనీసం నాలుగు నెలల సమయం కూడా లేదు. ఇంత తక్కువ వ్యవధిలో రెండు జట్లను ఎంపిక చేసి వారి కోసం ఆటగాళ్ల వేలం నిర్వహించి టోర్నీకి సిద్ధమయ్యేందుకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. పైగా ఆట మాత్రమే కాకుండా ఇన్నేళ్లుగా సాగుతున్న ఐపీఎల్ వ్యవస్థలో వారు భాగమై అలవాటు పడేందుకు ఈ సమయం సరిపోదు. అదే ఈసారి కొత్త జట్లను అనుమతించకపోతే 2022కు కావాల్సిన విధంగా జట్ల ఎంపిక, స్పాన్సర్లు, మీడియా హక్కులు, టెండర్లు... ఇలా అన్ని విషయాల్లో హడావిడి లేకుండా ప్రశాంతంగా పని చేయవచ్చు’ అని బోర్డు సీనియర్ సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు.