‘బయో బబుల్‌’ దాటితే... 

BCCI Warns Franchises To Keep Players In Bio Bubble  - Sakshi

లీగ్‌నుంచి బహిష్కరణ, రూ. కోటి జరిమానా 

ఫ్రాంచైజీలకు బీసీసీఐ హెచ్చరిక 

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను ఎట్టి పరిస్థితుల్లోనూ సురక్షిత పరిస్థితుల్లో నిర్వహించేందుకు, ఆటగాళ్లను బయో బబుల్‌ చట్రంలోనే ఉంచేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన మార్గదర్శకాలు రూపొందించింది. బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని లీగ్‌ నుంచి బహిష్కరించడంతో పాటు ఆయా జట్టుపై కోటి రూపాయల భారీ జరిమానా విధించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎనిమిది ఫ్రాంచైజీలకు బీసీసీఐ గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా ఆటగాడు తొలిసారి బబుల్‌ నుంచి బయటకి వస్తే ఆరు రోజుల తప్పనిసరి స్వీయ నిర్బం«ధాన్ని పాటించాలని పేర్కొంది. రెండో సారి కూడా అదే తప్పు చేస్తే ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌... మూడో సారి నిబంధనలు అతిక్రమిస్తే లీగ్‌ నుంచి బహిష్కరిస్తామని వెల్లడించింది. అతని స్థానంలో మరో ఆటగాడిని కూడా అనుమతించబోమని స్పష్టం చేసింది.

రోజూవారీ వైద్య పరీక్షలకు హాజరుకాకపోయినా, జీపీఎస్‌ పరికరాలు ధరించకపోయినా ఆటగాళ్లపై రూ. 60,000 జరిమానా విధించనుంది. ఈ నిబంధన క్రికెటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు, జట్టు అధికారులకు కూడా వర్తిస్తుందని చెప్పింది. మరోవైపు ఈ అంశంలో ఫ్రాంచైజీలు కూడా ఉదాసీనంగా వ్యవహరించరాదని హెచ్చరించింది. బయటి వ్యక్తుల్ని బయో బబుల్‌లోకి అనుమతిస్తే తొలి తప్పిదంగా రూ. కోటి జరిమానా విధించనున్నట్లు తెలిపింది. రెండో సారి ఇదే పునరావృతమైతే ఒక పాయింట్, మూడోసారి కూడా తప్పు చేస్తే రెండు పాయింట్ల కోత విధిస్తామని చెప్పింది. ఆరోగ్య భద్రతా నిబంధనల్ని పదే పదే ఉల్లంఘిస్తున్న వారు బీసీసీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. యూఏఈలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ప్రతీ ఐదు రోజులకొకసారి వైద్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top