ఐపీఎల్‌ 2022 వేదిక మార్పుపై పరోక్ష సంకేతాలు పంపిన బీసీసీఐ 

BCCI May Host IPL 2022 Abroad If COVID Situation Worsens In India Says Reports - Sakshi

భారత క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌. ఈ ఏడాది ఐపీఎల్‌ను స్వదేశంలో జరపాలని బీసీసీఐ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కరోనా ఉధృతి కారణంగా వేదిక తరలింపు తప్పేలా లేదని తెలుస్తుంది. దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభమై.. రోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. ఐపీఎల్‌ నిర్వహణపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతుంది. మహమ్మారి విజృంభణ కారణంగానే మెగా వేలం, ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకటనలోనూ జాప్యం జరుగుతుందని బీసీసీఐ అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. 

కోవిడ్‌ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉధృతి ఏప్రిల్‌, మే నెలల్లో తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఐపీఎల్‌ 2022ను విదేశాలకు తరలించాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై భారత క్రికెట్‌ బోర్డు పరోక్ష సంకేతాలు కూడా పంపింది. 

కాగా, ఐపీఎల్‌ 15వ ఎడిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌లోనే నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా కరోనా పరిస్థితుల కారణంగా లీగ్‌ను గతేడాది లాగే దుబాయ్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మెగా వేలం నిర్వహణ విషయంలోనూ బీసీసీఐలో సందిగ్ధత నెలకొంది. ముందుగా మెగా వేలాన్ని డిసెంబ‌ర్‌లోనే పూర్తి చేయాలని భావించినప్పటికీ ప‌లు కార‌ణాల‌తో ఈ తంతు వాయిదా ప‌డింది. దీంతో ఫిబ్ర‌వ‌రి మొద‌టి వారంలో వేలం కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌డానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తుంది.
చదవండి: IPL 2022: ఆ ముగ్గురు ఎవరో జనవరి 31లోగా తేల్చుకోండి..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top