IPL Womens: మహిళల ఐపీఎల్‌కు రంగం సిద్ధం

BCCI Earmarks Window In March 2023 For Inaugural Womens IPL - Sakshi

వచ్చే మార్చిలో తొలి టోర్నీ జరిగే అవకాశం

దేశవాళీ షెడ్యూల్‌లో మార్పులు చేసిన బోర్డు  

ముంబై: మహిళల క్రికెట్‌ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక అడుగు ముందుకు వేసింది. 2023లో సీజన్‌లో తొలిసారి మహిళల ఐపీఎల్‌ను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. గతంలోనూ పలుమార్లు మహిళల లీగ్‌ నిర్వహణకు సంబంధించి బోర్డు పెద్దలు ఎన్నో వ్యాఖ్యలు, ప్రకటనలు చేసినా వాస్తవానికి వచ్చేసరికి అవి అమల్లోకి రాలేదు. ఈసారి మాత్రం ఐపీఎల్‌ కోసం ‘ప్రత్యేక విండో’ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మహిళల దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్‌లో బోర్డు మార్పులు చేసింది.

సాధారణంగా భారత్‌ మహిళల దేశవాళీ మ్యాచ్‌ల షెడ్యూల్‌ నవంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు ఉంటుంది. అయితే తాజాగా ప్రకటించిన షెడ్యూల్‌లో దీనికి ఒక నెల రోజులు ముందుకు జరిపారు. 2022–23 సీజన్‌ అక్టోబర్‌ 11న ప్రారంభమై ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఫిబ్రవరి 9 నుంచి 26 వరకు దక్షిణాఫ్రికాలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌ ముగిసిన వెంటనే మార్చి నెలలో పూర్తి స్థాయి ఐపీఎల్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి.  

టి20 చాలెంజ్‌ టోర్నీ తర్వాత... 
సాధారణ దేశవాళీ మ్యాచ్‌లకు భిన్నంగా లీగ్‌ రూపంలో 2018 నుంచి బీసీసీఐ ‘టి20 చాలెంజ్‌’ టోర్నీ నిర్వహిస్తోంది. మొదటి ఏడాది కేవలం రెండు జట్ల మధ్య ఒకే ఒక మ్యాచ్‌ జరగ్గా, ఆ తర్వాత దానిని మూడు జట్లకు పెంచారు. కరోనా కారణంగా 2021లో మినహా నాలుగుసార్లు నిర్వహించారు. ఇందులో విదేశీ క్రికెటర్లు కూడా భాగమయ్యారు. అయితే మరింత ఆకర్షణీయంగా మారుస్తూ పూర్తి స్థాయిలో ఐపీఎల్‌ తరహాలో లీగ్‌ జరపాలనే డిమాండ్‌ ఇటీవల చాలా పెరిగిపోయింది.

టి20 ఫార్మాట్‌లో గత కొంత కాలంగా మన అమ్మాయిల మెరుగైన ప్రదర్శన కూడా అందుకు కారణం. కామన్వెల్త్‌ క్రీడల్లో మన జట్టు రజతం సాధించగా... బిగ్‌బాష్‌ లీగ్, హండ్రెడ్‌ లీగ్‌లలో కూడా భారత ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. గత మే నెలలో బోర్డు కార్యదర్శి జై షా చెప్పినదాని ప్రకారం లీగ్‌లో గరిష్టంగా ఆరు జట్ల వరకు ఉండే అవకాశం ఉంది. మహిళల టీమ్‌లను కూడా సొంతం చేసుకునేందుకు ప్రస్తుత ఐపీఎల్‌ టీమ్‌ల యాజమాన్యాలు కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఫ్రాంచైజీల వరకు జట్లను కేటాయిస్తే మొదటి ప్రాధాన్యత ఐపీఎల్‌ టీమ్‌లకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిపై తుది నిర్ణయం వచ్చే సెప్టెంబరులో జరిగే బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో తీసుకుంటారు.

చదవండి: MI Emirates: 'పొలార్డ్‌ నుంచి బౌల్ట్‌ దాకా'.. ఆరంభం కాకముందే టైటిల్‌పై కన్నేశారు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top