గర్ల్‌ఫ్రెండ్స్‌.. శ్రుతిమించుతున్నారు!.. ఇకపై.. | BCCI Angry On Girlfriend Culture In IPL Set To Take Drastic Action: Report | Sakshi
Sakshi News home page

గర్ల్‌ఫ్రెండ్స్‌.. శ్రుతిమించుతున్నారు!.. ఇకపై..

May 4 2026 12:23 PM | Updated on May 4 2026 12:39 PM

BCCI Angry On Girlfriend Culture In IPL Set To Take Drastic Action: Report

టీ20 ప్రపంచకప్‌-2026 గెలిచిన సమయంలో హార్దిక్‌తో మహీక

ఐపీఎల్‌లో టీమిండియా స్టార్ల వైఖరిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘గర్ల్‌ఫ్రెండ్స్‌’ విషయంలో కొంతమంది శ్రుతి మించి ప్రవర్తిస్తున్నట్లు బోర్డుకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రియురాళ్ల కోసం టీమ్‌ బస్సులు ఆపించడం.. తమతో కలిసి ఒకే హోటల్‌లోని ఆటగాళ్లు వారిని తీసుకువెళ్లడం పట్ల బీసీసీఐ సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

కాగా ఐపీఎల్‌-2026 సందర్భంగా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ ఇషాన్‌ కిషన్‌, పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ తరచూ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.

ముగ్గురూ మోడల్స్‌
హార్దిక్‌ పాండ్యా తన కొత్త ప్రేయసి మహీకా శర్మను స్టేడియానికి తీసుకువస్తుండగా.. ఇషాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌ అదితి హుండియా, అర్ష్‌దీప్‌ ప్రియురాలు సమ్రీన్‌ కౌర్‌ తరచూ వీరితో కలిసి జంటగా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురూ మోడల్స్‌, నటీమణులన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా!

టీమ్‌ బస్సులను ఆపివేస్తున్నారు
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు దైనిక్‌ జాగరణ్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇంతటితో దీనిని ఆపకపోతే.. భవిష్యత్తులో సమస్య తీవ్రమవుతుంది. ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్‌ కోసమని టీమ్‌ బస్సులను ఆపివేస్తున్నారు. వారి ఆలస్యానికి మిగతా వాళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.

అంతేకాదు.. కొందరు ఆటగాళ్లు గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి ఒకే హోటల్లో ఉంటున్నారు. ఈ విషయంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దృష్టి సారించింది. అయితే, అధికారికంగా తమ ప్రేమ బంధాన్ని ప్రకటించిన వారికి మినహాయింపు ఇస్తామని తెలిపింది.

బీసీసీఐలో ఇలాంటి పాలసీ లేదు
ఈ ‘అఫీషియల్‌ గర్ల్‌ఫ్రెండ్‌’ రూల్‌ ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. బీసీసీఐలో ఇలాంటి పాలసీ లేదు. సాధారణంగా క్రికెటర్ల భార్యలు, కుటుంబాలను మాత్రమే.. అది కూడా కొన్ని నిబంధనలకు లోబడి బోర్డు అనుమతిస్తుంది. ఈ గర్ల్‌ఫ్రెండ్‌ కల్చర్‌పై లోతుగా విచారణ చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.

బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోషన్‌ చేసిన వాళ్లే!
కాగా ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్‌లో కొందరు గతంలో బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోషన్‌ చేసిన వాళ్లే. ప్రస్తుతం వాళ్లు ఏకంగా జట్టుతో టీమ్‌ బస్సులో వెళ్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ చిన్న సమాచారం లీకైనా తలనొప్పులు తప్పవని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. యశ్‌ దయాళ్‌ వంటి ఆటగాళ్ల విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. అతడిపై ఓ అమ్మాయి, ఓ మైనర్‌ తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణలు చేశారు. దీంతో ఈ సీజన్‌ నుంచి అతడిని పక్కనపెట్టింది ఆర్సీబీ. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బోర్డు పరువు దిగజారడం ఖాయం. అందుకే గర్ల్‌ఫ్రెండ్‌ కల్చర్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.

చదవండి: ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్‌ అయ్యర్‌

Advertisement
 
Advertisement
Advertisement