ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer Reacts After Defeat To Gujarat Titans, That Didnt Work Out Vs GT Excited For Playing Against SRH | Sakshi
Sakshi News home page

ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్‌ అయ్యర్‌

May 4 2026 11:24 AM | Updated on May 4 2026 1:18 PM

That Didnt Work Out Vs GT Excited for Playing Against SRH: Shreyas Iyer

గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాజయంపై పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పందించాడు. అహ్మదాబాద్‌ పిచ్‌ బ్యాటర్లకు ఆరంభంలో అంతగా అనుకూలించకపోయినా.. తాము మెరుగైన స్కోరు సాధించడం సంతోషమన్నాడు. ఏదేమైనా క్రెడిట్‌ గుజరాత్‌ బౌలర్లకు దక్కుతుందని.. వాళ్లు అద్భుతంగా ఆడారని కొనియాడాడు.  

163 పరుగులు
సొంతమైదానంలో ఆదివారం జరిగిన పోరులో మాజీ చాంపియన్‌ గుజరాత్‌ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించిన సంగతి తెలిసిందే. సీజన్‌ ఆరంభంలో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో పరాజయం ఎరగకుండా సాగిన పంజాబ్‌కిది వరుసగా రెండో ఓటమి కావడం గమనార్హం. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 163 పరుగులు చేసింది.

టాపార్డర్‌ విఫలం కాగా... సూర్యాంశ్‌ (29 బంతుల్లో 57; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకంతో మెరవగా... స్టొయినిస్‌ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్‌) విలువైన పరుగులు చేశాడు. 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో ఈ జంట ఆరో వికెట్‌కు 44 బంతుల్లో 79 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హోల్డర్‌ 24 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా... సిరాజ్, రబాడ చెరో 2 వికెట్లు తీశారు.

సాయి సుదర్శన్‌ అర్ధశతకం
అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్‌ టైటాన్స్‌ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ (41 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో ఆకట్టుకోగా... వాషింగ్టన్‌ సుందర్‌ (23 బంతుల్లో 40 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్, వైశాక్‌ చెరో 2 వికెట్లు తీశారు.

సిరాజ్‌ తొలి ఓవర్‌లోనే 2 వికెట్లు... 
ఈ సీజన్‌లో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌... తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లతో పంజాబ్‌ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికి బతికిపోయిన ప్రియాన్ష్‌ ఆర్య (2) రెండో బంతికి అవుట్‌ కాగా... తదుపరి బంతికి కూపర్‌ (0) పెవిలియన్‌ బాట పట్టాడు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (15) ఎక్కువసేపు నిలవలేకపోగా... నేహల్‌ వధేరా (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (19) కూడా అవుటవ్వడంతో పంజాబ్‌ జట్టు 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో స్టొయినిస్‌తో కలిసి సూర్యాంశ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. మానవ్‌ సుతార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో సూర్యాంశ్‌ వరుసగా 6, 6, 4, 4, 6 కొట్టడంతో 27 పరుగులు వచ్చాయి.

ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మరోసారి గుజరాత్‌ బౌలర్లు విజృంభించడంతో పంజాబ్‌ జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆశించిన స్కోరు సాధించలేకపోయింది. స్టొయినిస్, బార్ట్‌లెట్‌ (0)ను వరుస బంతుల్లో అవుట్‌ చేసిన హోల్డర్‌ పంజాబ్‌ను కట్టడి చేశాడు.

చక్కగా ఉపయోగించుకున్నారు
ఈ నేపథ్యంలో పంజాబ్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి వికెట్‌ మీద మేము ఈ మేరకు స్కోరు చేయడం వ్యక్తిగతంగా గొప్ప విషయంగానే భావిస్తున్నా. ముఖ్యంగా కొత్త బంతితో వాళ్లు అటాక్‌ చేస్తున్న వేళ మేము మెరుగైన ఆరంభమే అందుకున్నాం. అయితే, గుజరాత్‌ బౌలర్లు ఈ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు.

సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బంతులు సంధించారు. పవర్‌ ప్లేలో మేము వరుసగా వికెట్లు కోల్పోయాము. అయినా పుంజుకోగలిగాము. మా బౌలర్లు కూడా మెరుగ్గా ఆడారు. కానీ ఈరోజు మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేకపోయాము. గెలవాలనే ఇక్కడికి వచ్చాము. అయితే, పని పూర్తి చేయలేకపోయాము.

SRHపై గెలుస్తాం
తదుపరి ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా ఆ జట్టుపై గెలిచి మరో రెండు పాయింట్లు మా ఖాతాలో జమ చేసుకుంటాము’’ అని పేర్కొన్నాడు. కాగా పంజాబ్‌ కింగ్స్‌ హైదరాబాద్‌ వేదికగా బుధవారం సన్‌రైజర్స్‌తో తలపడనుంది. 

కాగా పంజాబ్‌ ఇప్పటికి తొమ్మిదింట ఏడు విజయాలతో పట్టికలో టాప్‌లో ఉండగా.. సన్‌రైజర్స్‌ పదింట ఆరు గెలిచి మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీజన్‌లో తొలి ముఖాముఖి పోరులో పంజాబ్‌ సన్‌రైజర్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.

చదవండి: నా వల్లే ఓటమి.. భారీ మూల్యమే చెల్లించాం: కమిన్స్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement