కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయంపై సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. తాము శుభారంభం అందుకున్నా.. దానిని కొనసాగించలేకపోవడం తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. కనీసం 180 పరుగులు స్కోరు చేసి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదన్నాడు. ఐపీఎల్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరుకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
హెడ్ మెరుపు అర్ధ సెంచరీ
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో బలహీన కేకేఆర్ చేతిలో జట్టు అనూహ్యంగా ఓటమిపాలైంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగిన పోరులో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో రైజర్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ 19 ఓవర్లలో 165 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (28 బంతుల్లో 61; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు.
మిగిలిన వారిలో ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా.. మిగతావాళ్లంతా చేతులెత్తేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ వరుణ్ చక్రవర్తికి 3 వికెట్లు దక్కాయి. నరైన్, కార్తీక్ త్యాగి 2 వికెట్ల చొప్పున తీశారు.
అనంతరం కోల్‌కతా 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 169 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంగ్‌కృష్ రఘువంశీ (47 బంతుల్లో 59; 5 ఫోర్లు, 2 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ అజింక్య రహానే (36 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.
ఏకంగా 47 పరుగులు సమర్పించుకుని..
సన్‌రైజర్స్ బౌలర్లలో సాకిబ్ హుసేన్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మిగిలిన వారిలో శివాంగ్ 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా.. ఎషాన్ మలింగ, కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు.
కమిన్స్ నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 47 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్ తీయగా.. ఎషాన్ 3.2 ఓవర్లోలనే 42 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కమిన్స్ (Pat Cummins) మాట్లాడుతూ.. తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా లేనన్నాడు.
తప్పంతా నాదే.. ఓటమికి కారణం నేనే!
‘‘ఈరోజు మాది కాదు. మేము శుభారంభం అందుకున్నప్పటికీ దానిని కొనసాగించలేకపోయాము. కనీసం 180- 200 పరుగులు చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. కనీసం 180 పరుగులైనా స్కోరు చేస్తామనుకున్నాను.
మా ఇన్నింగ్స్ ద్వితీయార్థ భాగం చప్పగా సాగింది. ఇందులో నేను కూడా భాగమే. ఏదేమైనా వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవడం మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈరోజు కూడా మా బౌలర్లు మెరుగ్గా రాణించడం సానుకూలాంశం. నాలుగో ఓవర్లో నేను ఏకంగా 27 పరుగులు ఇవ్వడం మాత్రం తీవ్ర ప్రభావం చూపింది.
దీని కారణంగా మేము భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. చిన్న చిన్న తప్పిదాలే తీవ్ర ప్రభావం చూపుతాయి’’ అని కమిన్స్ నిరాశ వ్యక్తం చేశాడు. ఓటమికి తానే కారణమని పరోక్షంగా వెల్లడిస్తూ తప్పు తన మీద వేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో కమిన్స్ 8 బంతుల్లో 10 పరుగులు చేశాడు.
చదవండి: ‘భారీ’ ధరకు అమ్ముడుపోయిన అర్జున్ టెండుల్కర్
Pat Cummins turns the corner 👏
🎥 27 runs off the over but the #SRH skipper comes back with a wicket 👊
Finn Allen departs!
Updates ▶️ https://t.co/muersQO7at#TATAIPL | #KhelBindaas | #SRHvKKR | @SunRisers pic.twitter.com/Aicconk2N8— IndianPremierLeague (@IPL) May 3, 2026


