BBL 2022-23: ఆఖరి బంతికి సిక్సర్‌ కావాలి, స్ట్రయిక్‌లో స్టోయినిస్‌.. ఏం జరిగిందంటే..?

BBL 2022 23: Melbourne Stars Beat Brisbane Heat By 4 Runs - Sakshi

బిగ్‌బాష్‌ లీగ్‌ 2022-23 సీజన్‌లో మరో రసవత్తర సమరం జరిగింది. గబ్బా వేదికగా బ్రిస్బేన్‌ హీట్‌-మెల్‌బోర్న్‌ స్టార్స్‌ మధ్య ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. మెల్‌బోర్న్‌ గెలవాలంటే ఆఖరి బంతికి సిక్సర్‌ బాదాల్సి ఉండింది. స్ట్రయిక్‌లో మార్కస్‌ స్టోయినిస్‌ ఉన్నాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆఖరి బంతికి సిక్సర్‌ బాది తన జట్టును గెలిపించిన స్టోయినిస్‌ ఈసారి మాత్రం నిరాశపరిచాడు.

స్పెన్సర్‌ జాన్సన్‌ వేసిన లో ఫుల్‌ టాస్‌ బంతిని స్టోయినిస్‌ భారీ షాట్‌గా మలిచేందుకు విఫలయత్నం చేశాడు. మెల్‌బోర్న్‌ కేవలం ఒక్క పరుగుతో మాత్రమే సరిపెట్టుకుని, 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు ఓవర్‌లో (ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌) 21 పరుగులు పిండుకున్న స్టోయినిస్‌ (23 బంతుల్లో 36 నాటౌట్‌; ఫోర్‌, 3 సిక్సర్లు), హిల్టన్‌ కార్ట్‌రైట్‌ (24 బంతుల్లో 33 నాటౌట్‌; 5 ఫోర్లు) జోడీ ఆఖరి ఓవర్‌లో కేవలం​ 9 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్రిస్బేన్‌ హీట్‌.. సామ్‌ హెయిన్‌ (41 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), పియర్సన్‌ (43 బంతుల్లో 57 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌) మెరుపు హాఫ్‌ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మెల్‌బోర్న్‌ బౌలర్లలో లూక్‌ వుడ్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్‌ నైల్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

ఛేదనలో మెల్‌బోర్న్‌ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ వారికి విజయం దక్కలేదు. జో క్లార్క్‌ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు), థామస్‌ రోజర్స్‌ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), క్యాంప్‌బెల్‌ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు), స్టోయినిస్‌ (36 నాటౌట్‌), హిల్టన్‌ (33 నాటౌట్‌) తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.

నిర్ణీత ఓవర్లలో మెల్‌బోర్న్‌ 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. బ్రిస్బేన్‌ బౌలర్లలో స్వెప్సన్‌ 2, జేమ్స్‌ బాజ్లీ ఓ వికెట్‌ పడగొట్టారు. ఈ గెలుపుతో బ్రిస్బేన్‌ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో (ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (13 పాయింట్లు) ఎగబాకింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top