Babar Azam: జర్నలిస్ట్‌ తిక్క ప్రశ్న.. బాబర్‌ ఆజం దిమ్మతిరిగే కౌంటర్‌

Babar Azam Epic Counter Journalist On Question Over His Captaincy - Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఒక జర్నలిస్టు అడిగిన తిక్క ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. విషయంలోకి వెళితే.. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ ఇచ్చిన 173 పరగుల టార్గెట్‌ను 19.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అందుకుంది. మహ్మద్‌ రిజ్వాన్, బాబర్‌ ఆజంలు అర్థసెంచరీలతో చెలరేగగా..మహ్మద్‌ నవాజ్‌ 45 పరుగులు నాటౌట్‌ జట్టును గెలిపించాడు.

ఈ విషయం పక్కనబెడితే పాకిస్తాన్‌ జట్టుకు ఈ మధ్య కాలంలో ఫైనల్‌ మ్యాచ్‌లు పెద్దగా కలిసిరావడం లేదు. ముందుగా ఆసియా కప్‌ చూసుకుంటే శ్రీలంకతో జరిగిన ఫైనల్లో బోల్తా కొట్టిన పాక్‌ చివరికి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 4-3తో కోల్పోయింది. అయితే తాజాగా టి20 ప్రపంచకప్‌కు ముందు బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌లతో జరుగుతున్న ట్రై సిరీస్‌లో పాకిస్తాన్‌ మరోమారు ఫైనల్‌కు చేరింది.

ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ముగిసిన అనంతరం బాబర్‌ ఆజం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నాడు. ''మీరు ఒక కెప్టెన్‌గా అన్ని ఫైనల్స్‌ ఓడిపోతున్నారు.. మరి ఈసారి ఫైనల్‌ గెలుస్తారన్న నమ్మ​కం ఉందా'' అంటూ ఒక జర్నలిస్టు తిక్క ప్రశ్న వేశాడు. దీంతో మండిపోయిన బాబర్‌ ఆజం.. ''మీరు ఎవరు గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.. మ్యాచ్‌లో గెలుపోటములు సహజం.. ఫైనల్‌ మ్యాచ్‌ గెలుస్తామా లేదా అన్నది ముందే ఎలా చెప్పగలం. ఆట ఆడడం మా నైతిక ధర్మం.. అంతేకానీ విజయం అనేది మా చేతుల్లో రాసిపెట్టిలేదు. వంద శాతం గెలిచేందుకే ప్రయత్నిస్తాం.. ఓడిపోతే మేం ఏం చేయగలం.. ప్రతీదాన్ని భూతద్దంలో చూడకండి'' అంటూ బదులిచ్చాడు. 

ఇక ట్రై సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియాకు చేరుకోనున్న పాకిస్తాన్‌ జట్టు అక్టోబర్‌ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియాను పాకిస్తాన్‌ 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top