AUS-W vs IND-W: ఆఖరి టీ20లోనూ భారత్‌కు తప్పని ఓటమి..

Australia Defeat India By 54 Runs, Win Series 4 1 - Sakshi

ముంబై: గత మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా మహిళల చేతికి టి20 సిరీస్‌ అప్పగించిన భారత మహిళల జట్టు చివరి పోరులోనూ చతికిలపడింది. ఫలితంగా సొంతగడ్డపై సిరీస్‌ను ఓటమితో ముగించింది. మంగళవారం జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రే లియా 54 పరుగులతో భారత్‌పై నెగ్గి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా... భారత్‌ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్‌ పేసర్‌ హీతర్‌ గ్రాహమ్‌ (4/8) ‘హ్యాట్రిక్‌’తో భారత్‌ను దెబ్బ తీసింది.

తాను వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లోని చివరి రెండు బంతులకు దేవిక, రాధ యాదవ్‌లను అవుట్‌ చేసిన హీతర్‌... 20వ ఓవర్‌ తొలి బంతికి రేణుక సింగ్‌ను అవుట్‌ చేసి ‘హ్యాట్రిక్‌’ పూర్తి చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా తరఫున యాష్లే గార్డ్‌నర్‌ (32 బంతుల్లో 66 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌), గ్రేస్‌ హారిస్‌ (35 బంతుల్లో 64 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలతో చెలరేగారు. 67 పరుగుల వద్దే ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోగా, ఆ తర్వాత గార్డ్‌నర్, హారిస్‌ కలిసి జట్టుకు భారీ స్కోరు అందించారు.

వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 62 బంతుల్లోనే 129 పరుగులు జోడించడం విశేషం. తొలి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 72 పరుగులు కాగా, తర్వాతి 10 ఓవర్లలో జట్టు 124 పరుగులు సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఒక్క దీప్తి శర్మ (53; 8 ఫోర్లు, 1 సిక్స్‌) చివరి వరకు పోరాడటం మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. హర్లీన్‌ (24) ఫర్వాలేదనిపించగా... టాప్‌ బ్యాటర్లు స్మృతి మంధాన (4), షఫాలీ వర్మ (13), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (12) ప్రభావం చూపలేకపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు.
చదవండి: FIFA WC 2022: అభిమాన సంద్రం మధ్య... అర్జెంటీనా జట్టు సంబరాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top