
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ (Scott Boland) సరికొత్త చరిత్ర సృష్టించాడు. సమకాలీన బౌలర్లలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. 1915 తర్వాత టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
వెస్టిండీస్‌తో మూడో టెస్టు సందర్భంగా బోలాండ్ ఈ ఫీట్ నమోదు చేశాడు. కాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, ఐదు టీ20లు ఆడుతోంది. ఇందులో భాగంగా తొలుత టెస్టు సిరీస్ మొదలుకాగా.. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది ఆసీస్.
225 పరుగులకు ఆసీస్ ఆలౌట్
ఈ క్రమంలో విండీస్- ఆసీస్ (WI vs AUS) మధ్య నామమాత్రపు మూడో టెస్టు జమైకా వేదికగా శనివారం మొదలైంది. కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసింది. కామెరాన్ గ్రీన్ (46), స్టీవ్ స్మిత్ (48) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 225 పరుగులు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో షమార్ జోసెఫ్ నాలుగు వికెట్లు కూల్చగా.. జేడన్ సీల్స్, జస్టిన్ గ్రీవ్స్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
143 పరుగులకు కుప్పకూలిన విండీస్
ఇక ఆసీస్ ఆలౌట్ అయిన తర్వాత తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్.. 143 పరుగులకే కుప్పకూలింది. జాన్ కాంప్‌బెల్ చేసిన 36 పరుగులే విండీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్. దీనిని బట్టి ఆసీస్ బౌలర్ల విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. స్కాట్ బోలాండ్ అత్యుత్తమంగా 13.1 ఓవర్లలో కేవలం 34 పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు కూల్చాడు. మిగతా వారిలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
కాగా వెస్టిండీస్‌తో టెస్టులో ఉత్తమంగా రాణించిన స్కాట్ బోలాండ్.. ఓ అరుదైన రికార్డును సాధించాడు. 1915 తర్వాత టెస్టు క్రికెట్‌లో కనీసం 2000 డెలివరీలు సంధించిన బౌలర్లలో అత్యుత్తమ సగటు కలిగిన ఆటగాడిగా నిలిచాడు. తన నాలుగేళ్ల కెరీర్‌లో 17.33 సగటుతో బోలాండ్ 59 వికెట్లు కూల్చాడు. ఇక 1901- 1914 వరకు ఇంగ్లండ్‌కు ఆడిన సిడ్నీ బార్న్స్ 16.43 సగటుతో వికెట్లు కూల్చాడు.
1915 నుంచి ఇప్పటికి.. 2000 డెలివరీల తర్వాత అత్యుత్తమ బౌలింగ్ యావరేజ్ కలిగి ఉన్న బౌలర్లు (యాక్టివ్ క్రికెటర్లలో)
👉స్కాట్ బోలాండ్ (ఆస్ట్రేలియా): 2021-2025- 17.33 సగటుతో 59 వికెట్లు
👉బెర్ట్ ఐరన్‌మోంగర్ (ఆస్ట్రేలియా): 1928- 1933- 17.97 సగటుతో 74 వికెట్లు
👉ఫ్రాంక్ టైసన్ (ఇంగ్లండ్): 1954- 1959- 18.56 సగటుతో 76 వికెట్లు
👉అక్షర్ పటేల్ (ఇండియా): 2021-2024- 19.34 సగటుతో 55 వికెట్లు
👉జస్‌ప్రీత్ బుమ్రా (ఇండియా): 2018-2025- 19.48 సగటుతో 217 వికెట్లు.
చదవండి: ENG VS IND 3rd Test: 23 ఏళ్ల కిందటి రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన గిల్