లవ్లీనాకు భారీ ప్రోత్సాహకాలు: డీఎస్పీ ఉద్యోగం.. రూ. కోటి నజరానా

Assam CM Presents Rs 1 Crore to Lovlina Borgohain Offers DSP Post - Sakshi

ప్రకటించిన అసోం ముఖ్యమంత్రి

డిస్పూర్‌: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత మహిళా బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెయిన్‌కు అసోం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సహాకాలు ప్రకటించింది. లవ్లీనాకు డీఎస్పీ ఉద్యోగం ఆఫర్‌ చేయడంతో పాటు కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన లవ్లీనాకు గురువారం గౌహతిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనికి అసోం ముఖ్యమంత్రి డాక్టర్‌ హిమంత బిస్వ శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం బాక్సర్ లవ్లీనాను రాష్ట్ర పోలీసుశాఖలో డీఎస్‌పీగా చేరమని అభ్యర్థించారు. అంతేకాక ఆమెకు కోటి రూపాయల నజరాన ప్రకటించారు. అలానే లవ్లీనా కోచ్‌కు 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించింది అసోం ప్రభుత్వం.

అలానే అసోంలోని గోలాఘాట్ జిల్లాలోని సౌపాతర్‌లో లవ్లీనా బోర్గోహెయిన్‌ పేరు మీద రూ. 25 కోట్లతో క్రీడా ప్రాంగణాన్ని నిర్మించనున్నట్లు హిమంత శర్మ తెలిపారు. సన్మాన కార్యక్రమం సందర్భంగా హిమంత బిస్వా శర్మ స్వయంగా గౌహతి విమాన్రాశయం చేరుకుని లవ్లీనాకు స్వాగతం పలికారు. అనంతరం బాక్సర్‌ భారీ కటౌట్‌లతో అలంకరించిన బస్సులో లవ్లీనాను ఎక్కించుకుని సిటీ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ శ్రీమంత శంకరదేవ కళాక్షేత్రంలో లవ్లీనాకు సన్మానం జరిగింది. సాయంత్రం లవ్లీనా..  గవర్నర్ జగదీష్ ముఖిని కూడా కలిసే అవకాశం ఉంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top